Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడోకు షాక్.. మద్దతు ఉనసంహరించుకున్న మిత్రపక్షం

జస్టిన్ ట్రూడోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక మిత్ర పక్షమైన న్యూడెమోక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది.

Update: 2024-09-05 08:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లిబరల్ పార్టీకి కీలక మిత్రపక్షమైన జగ్మీత్ సింగ్ నాయకత్వంలోని న్యూడెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. 2022లో ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఎన్డీపీ చీఫ్ జగ్మీత్ సింగ్ తెలిపారు. లిబరల్ పార్టీ కార్పొరేట్ శక్తులకు తలవంచిందని, వారి విధానాలు ప్రజలను ఎంతో నిరాశకు గురి చేశాయని ఆరోపించారు. దేశంలో ఎటువంటి మార్పునూ తీసుకురాలేక పోయారని పేర్కొన్నారు. కెనడియన్ల నుంచి మరొక అవకాశం లిబర్ పార్టీకి దక్కబోదని చెప్పారు.

2022లో ట్రూడో ప్రభుత్వానికి మద్దతిస్తామని ఎన్డీపీ ప్రకటించింది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది 2025 అక్టోబర్ వరకు కొనసాగనుంది. అయితే ట్రూడో నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగ్మీత్ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు. తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. మధ్యతరగతి ప్రజల భవిష్యత్ కోసమే తాము పోరాడతామని స్పష్టం చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే మద్దతు ఉపసంహరించుకోవడం గమనార్హం.

ప్రభుత్వం పడిపోయే చాన్స్!

ఎన్డీపీ పార్టీ మద్దతు ఉపసంహరించు కోవడంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ట్రూడోకు చెందిన లిబర్ పార్టీకి ప్రస్తుతం పార్లమెంటులో 130 సీట్లు ఉన్నాయి. అధికారంలో కొనసాగాలంటే ఆ పార్టీకి మరో 9 సీట్లు అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు 24 సీట్లతో ఎన్డీపీ మద్దతిచ్చింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి 119 సీట్లు ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కన్జర్వేటివ్ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. కాబట్టి ఈ పార్టీ ట్రూడోకు మద్దతిచ్చే అకాశం లేదు. దీంతో ప్రభుత్వం పడిపోయే చాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు. 


Similar News