Muizzu: భారత్ చేరుకున్న ముయిజ్జు.. రేపు ప్రధాని మోడీతో భేటీ

ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆదివారం భారత్‌కు చేరుకున్నారు.

Update: 2024-10-06 12:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. సాయంత్రం 4:30గంటలకు న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ఆయనకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కిరీటి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ముయిజ్జుతో పాటు ఆదేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్, రక్షణ మంత్రి ఘసన్ మౌమూన్, హోం మంత్రి అలీ ఇహుసన్, ఆర్థిక మంత్రి మూసా జమీర్, ఆరోగ్య మంత్రి అహ్మద్ నజీమ్‌లు కూడా ఇండియాకు వచ్చారు. తన పర్యటనలో భాగంగా ముయిజ్జు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఇతర సీనియర్ అధికారులతో భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు చర్చలు జరపనున్నారు.

తమ దేశానికి ఆర్థిక సహాయం కోరడమే ఈ పర్యటన ఉద్దేశమని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే దీనిపై భారత్, మాల్దీవులు అధికారికంగా స్పందించలేదు. అంతేగాక ముయిజ్జు ముంబై, బెంగళూరులను కూడా సందర్శిస్తారు. అక్కడ మాల్దీవుల ప్రజలతో సంభాషించనున్నారు. ఈ పర్యటనలు పెట్టుబడి సంబంధాలను పెంపొందించడం, రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముయిజ్జూ తిరిగి గురువారం మాల్దీవులకు వెళ్లనున్నారు. కాగా, ముయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాల ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 


Similar News