Priyanka Gandhi : బంగ్లాలో హిందువులపై దాడులు.. ప్రియాంక గాంధీ ఆసక్తికర ట్వీట్
బంగ్లాదేశ్(Bangladesh)లోని ఇస్కాన్ (ISKCON)దేవాలయానికి చెందిన సాధువు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు(Chinmoy Krishnadas) అరెస్టుపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఎక్స్ వేదికగా స్పందించారు
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh)లోని ఇస్కాన్ (ISKCON)దేవాలయానికి చెందిన సాధువు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు(Chinmoy Krishnadas) అరెస్టుపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఎక్స్ వేదికగా స్పందించారు. బంగ్లాలో మైనారిటీ హిందువు(Hindus)లపై హింసాత్మక వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మైనారిటీల భద్రతకు భరోసా ఇవ్వాలని ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.
భారత్ లో మైనార్టీల ఓట్ల కోసం వారిపై ప్రేమ చూపే కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ లోని మైనార్టీ హిందువుల భద్రతపై ఎందుకు స్పందించదంటూ బీజేపీ విమర్శలు చేస్తున్న క్రమంలో ప్రియాంక గాంధీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. కాగా బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనను ఢాకా విమానాశ్రయంలో బంగ్లా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడి హిందువులు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్కాన్ ను నిషేదించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలైంది. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై దృష్టిసారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని శాంతిభద్రతల పరిస్థితిని గురువారం ఉదయంలోగా నివేదించాలని అటార్నీ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. కాగా అక్కడి పరిస్థితులు క్షీణించకుండా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.
బంగ్లాదేశ్ లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడుతున్న సమయంలో ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు చోటుచేసుకోవడంతో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఆయనను అరెస్టు చేయడం, బెయిలు నిరాకరించడంపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటం, నాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తు్న్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైశ్వాల్ పేర్కొన్నారు. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించామని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.