వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ దాడి..14 మంది పాలస్తీనియన్లు మృతి
గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. తాజాగా ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ సైన్యం దాడికి పాల్పడగా..14 మంది పాలస్తీనియన్లు మరణించారు.
దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. తాజాగా ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ సైన్యం దాడికి పాల్పడగా..14 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ అంబులెన్స్ డ్రైవర్‌ను కూడా హతమార్చినట్టు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ సైన్యం సుమారు 24గంటలకు పైగా నిరంతరం కాల్పులు జరిపారని వెల్లడించింది.
పాలస్తీనా నగరమైన తుల్కర్మ్‌కు సమీపంలోని నూర్ షామ్స్ ప్రాంతంలో దాడులకు పాల్పడినట్టు పేర్కొంది. మరణించిన వారిలో ఓ16ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ఈ దాడిలో అనేక మంది మిలిటెంట్లు మృతి చెందారని, ఎదురు కాల్పుల్లో తమ నలుగురు సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అలాగే సెంట్రల్ గాజాలో సైనికులు దాడులు నిర్వహిస్తున్నారని, అక్కడ వారు పాలస్తీనా సైనికులతో పోరాడుతున్నారని పేర్కొంది. కాగా, 1967 యుద్ధంలో వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలకు కేంద్రంగా మారింది.
కాగా, గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరింత ఉధృతంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడుల వల్ల అక్కడి పౌరులు ఆహార కొరతతో అల్లాడుతున్నారు. పలు దేశాలు మానవతా సాయం అందిస్తున్నప్పటికీ పరిస్థితులు భయానకంగానే ఉన్నాయి. అయితే గాజాలో కాల్పుల విరమణ చేపట్టి మానవతా సాయాన్ని వేగవంతం చేయాలని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 34000 మంది పాలస్తీనియన్లు మరణించారు.