Israel strikes: డ్రోన్ అటాక్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. బీరూట్, గాజాలో దాడులు తీవ్రం

తమ ప్రధాని నెతన్యాహు లక్ష్యంగా డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా లెబనాన్ రాజధాని బీరూట్, గాజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

Update: 2024-10-20 04:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమ ప్రధాని నెతన్యాహు లక్ష్యంగా డ్రోన్ దాడులు చేయడంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడికి ప్రతిస్పందనగా లెబనాన్ రాజధాని బీరూట్, గాజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై వైమాణిక దాడులు చేసింది. అలాగే ఉత్తర గాజా ప్రాంతంలోనూ భారీ దాడులు చేపట్టింది. ఈ పట్టణంలోని బీట్ లాహియాలో ఉన్న అనేక ఇళ్లపై దాడులు చేయగా సుమారు 73 మంది మరణించినట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. అంతేగాక అనేక మంది గాయపడినట్టు తెలిపాయి. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు.

మరోవైపు దక్షిణ బీరూట్‌పైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. దాడుల ప్రభావంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయని లెబనాన్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లాకు సంబంధించిన ఆయుధాలు నిల్వ చేసే సౌకర్యాలు, ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. అలాగే దహియే ప్రాంతాన్ని ఖాళీ చేయాలి ఐడీఎఫ్ ఆదేశించింది. ఈ ప్రాంతంలోని రెండు భవనాలను లక్ష్యంగా చేసుకున్నామని, ఇవి హిజ్బుల్లాకు రహస్య ప్రదేశాలుగా పని చేస్తున్నాయని ఆరోపించింది. కాబట్టి ఆ భవనాల సమీపంలో నివసించే వారు 500 మీటర్ల దూరం వెళ్లాలని కోరింది.

కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 42000 మంది పాలస్తీనియన్లు మరణించగా.. మిలియన్ మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరణించిన వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. ఇక లెబనాన్‌లో 2,400 మందికి పైగా లెబనీస్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గత నెల రోజుల నుంచే ఎక్కువ మరణాలు నమోదైనట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


Similar News