గాజాపై గ్రౌండ్ ఎటాక్‌కు రెడీ.. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటన
గాజాపై గ్రౌండ్ ఎటాక్ చేసేందుకు తాము సిద్ధమేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ హెర్జీ హలేవీ ప్రకటించారు.
టెల్‌అవీవ్ : గాజాపై గ్రౌండ్ ఎటాక్ చేసేందుకు తాము సిద్ధమేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ హెర్జీ హలేవీ ప్రకటించారు. గ్రౌండ్ ఎటాక్ చేసే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై వివిధ దేశాల అధినేతలతోనూ సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. బుధవారం గాజా సరిహద్దు ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శత్రువుపై దాడి చేయడానికి ప్రతి నిమిషాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. హమాస్ ఉగ్రవాదులు, విదేశీ బందీలను దాచిన ప్రాంతాలపై సమాచారం ఉంటే తమకు అందించాలని గాజా వాసులను ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది.
అలా సమాచారం అందించే వారి వివరాలను సీక్రెట్‌గా ఉంచుతామని, ప్రైజ్‌మనీని అందజేస్తామని ప్రకటించింది. ఈవిధంగా తమకు సహకరించే గాజావాసుల ఇంటికి రక్షణ కల్పించే బాధ్యతను ఇజ్రాయెల్ ఆర్మీ తీసుకుంటుందని హామీ ఇచ్చింది. ‘‘గాజా ప్రజలు ప్రశాంతంగా బతకడంతో పాటు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ మానవతా సహాయాన్ని చేయాలి’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశంపై తాజాగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. గ్రౌండ్ ఎటాక్ విషయంలో ఇజ్రాయెల్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.