Diamond: జిల్ బైడెన్ కు మోడీ ఖరీదైన బహుమతి.. పాపం వాడుకునే ఛాన్స్ మాత్రం లేదు

అమెరికా అధ్యక్ష పదవి వీడనున్న జో బైడెన్‌ (Joe Biden) కు ఖరీదైన బహుమతులు వచ్చినట్లు తెలుస్తోంది.

Update: 2025-01-03 11:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష పదవి వీడనున్న జో బైడెన్‌ (Joe Biden) కు ఖరీదైన బహుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ ప్రముఖులు తమ అధికారిక పర్యటనల్లో భాగంగా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు ఫస్ట్‌ లేడీ (US First Lady) జిల్‌ బైడెన్‌ (Jill Biden)కు ఖరీదైన బహుమతులు ఇచ్చారు. వీటిలో ప్రధాని మోడీ (PM Modi).. జిల్ బైడెన్‌కు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. 2023 జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ లో జో బైడెన్ .. మోడీకి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బైడెన్ దంప‌తుల‌కు మోడీ అరుదైన కానుక‌ల‌ను అంద‌జేశారు. ల్యాబ్ లో తయారు చేసిన 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్‌ను అమెరికా ఫ‌స్ట్ లేడీ జిల్ బైడెన్‌కు మోడీ గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే, ఆ డైమండ్ ను జిల్ వ్యక్తిగతంగా వాడలేరు. నిబంధనల ప్రకారం బైడెన్ పదవీ విరమణ చేసిన తర్వాత అమెరికా ప్రభుత్వం నుంచి దాన్ని మార్కెట్ విలువకు కొనుగోలు చేసే అవకాశం అమెరికా ప్రథమ మహిళకు ఉంటుంది. అధిక ధర ఉన్న వస్తువులు కొనే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. చట్టం ప్రకారం, విదేశీ అధికారుల నుండి 480 డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన బహుమతులు అందుకుంటే.. అవి ఏంటి అనే విషయాన్ని అధ్యక్షుడు ప్రకటించారు. ఖరీదైన వస్తువులు సాధారణంగా జాతీయ ఆర్కైవ్‌లకు బదిలీ చేస్తారు. లేదా అధికారికంగా ప్రదర్శిస్తారు.

డైమండ్ ప్రత్యేకతలు

ఇకపోతే, మోడీ బహుకరించిన ఆ డైమండ్ విలువ 20 వేల అమెరికన్‌ డాలర్లుగా(రూ.17.15 లక్షలు) ఉంటుంది. 2023లో అమెరికా అధ్యక్ష దంపతులకు లభించిన అన్ని బహుమతుల్లోకెల్లా ఇదే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అయితే, మోడీ ఇచ్చిన డైమండ్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భూమి నుంచి వ‌చ్చిన వ‌జ్రం త‌ర‌హాలోనే ఆ గ్రీన్ డైమండ్ ల‌క్షణాలు ఉంటాయ‌ట‌. ఆ వ‌జ్రం ఎకో ఫ్రెండ్లీ. సౌర‌, ప‌వ‌న విద్యుత్తు ద్వారా ఆ వ‌జ్రాన్ని త‌యారు చేశారు. ఈ వజ్రాన్ని కాగితపు గుజ్జుతో తయారు చేసిన చిన్న పెట్టెలో ఉంచి జిల్‌కు అందించారు. అంతేకాకుండా, జిల్‌కు యూఎస్‌లోని ఉక్రేనియన్‌ రాయబారి నుంచి ఓ బ్రూచ్‌ కూడా బహుమతిగా అందినట్లు తెలిసింది. దీని విలువ 14 వేల అమెరికన్‌ డాలర్లు ఉంటుంది. 2023లో అధ్యక్షుడు బైడెన్‌ దంపతులు అందుకున్న ఖరీదైన బహుమతుల (Joe Biden receives Expensive Gifts In 2023) వివరాలను యునైటెడ్‌ స్టేట్స్‌ చీఫ్‌ ఆఫ్‌ ప్రొటోకాల్‌ కార్యాలయం విడుదల చేసింది. అందులోనే మోడీ బహుమతి వివరాలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News