Odisha: పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్ కలకలం.. భద్రతపై ఆందోళనలు
ఒడిశాలోని (Odisha) ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి ఆలయంపై (Puri Jagannath temple) డ్రోన్ (Drone) కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని (Odisha) ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి ఆలయంపై (Puri Jagannath temple) డ్రోన్ (Drone) కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జరగడంతో.. భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, పూరీ జగన్నాథుడి ఆలయం సహా చుట్టు పక్కల ప్రాంతం ‘నో ఫై జోన్’లో ఉంది. కానీ, ఆదివారం తెల్లవారుజామున 4.10 నిమిషాల టైంలో ఆలయంపై డ్రోన్ ఎగిరింది. దాదాపు అరగంట పాటు చక్కర్లు కొడుతూనే ఉంది. దీంతో భద్రతాపరమైన ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే.. ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందుకోసం బృందాలను ఏర్పాటు చేశారు.
ఒడిశా మంత్రి..
ఈ ఘటనపై ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ స్పందించారు. ‘‘ఆలయంపై డ్రోన్ ఎగరడం చట్ట విరుద్ధం. భద్రతా పరమైన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయం చుట్టు ఉన్న నాలుగు వాచ్‌టవర్ల వద్ద 24 గంటలూ పోలీసు సిబ్బందిని మోహరించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది’’ అని రాష్ట్ర మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ పేర్కొన్నారు. ఆలయంపై డ్రోన్ ఎగరవేసింది సోషల్ మీడియా వ్లాగర్ కావొచ్చని.. అయినప్పటికీ దీని వెనక ఉన్న ఉద్దేశాన్ని అంచనావేయలేమని మంత్రి అన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.