Elon Musk : ట్రంప్ హోటల్ ఎదుట టెస్లా కారులో పేలుడు.. మస్క్ రియాక్షన్ ఇదీ
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలోని లాస్ వెగాస్‌లో కాబోయే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా సైబర్ ట్రక్ కారు(Tesla Cybertruck)లో పేలుడు సంభవించింది.
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలోని లాస్ వెగాస్‌లో కాబోయే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా సైబర్ ట్రక్ కారు(Tesla Cybertruck)లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఏడుగురికి గాయాలయ్యాయి. కారులో ఉన్న పేలుడు పదార్థాల వల్లే ఈ బ్లాస్ట్ జరిగిందని గుర్తించారు. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా.. ఎలాన్ మస్క్(Elon Musk)దే. జనవరి 19న అమెరికాలో కొలువుతీరనున్న ట్రంప్ సర్కారులో కీలక పదవిని మస్క్ చేపట్టనున్నారు. సైబర్ ట్రక్‌లో పేలుడు ఘటనపై ఆయన స్పందిస్తూ.. న్యూఆర్లియన్స్(New Orleans)లో జరిగిన ట్రక్కు దాడికి, టెస్లా సైబర్ ట్రక్ కారులో పేలుడుకు మధ్య సంబంధం ఉందేమో అనిపిస్తోందన్నారు. అది ఉగ్రవాద చర్యలా కనిపిస్తోందన్నారు. ఈ ఘటనలకు కారణమైన రెండు కార్లను కూడా టూర్ రెంటల్ వెబ్‌సైట్ నుంచి అద్దెకు తీసుకున్నారని మస్క్ గుర్తు చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.
లాస్ వెగాస్‌లో టెస్లా సైబర్ ట్రక్ కారులో పేలుడు అనేది వాహనలోపం వల్ల జరగలేదని.. పేలుడు పదార్థాల వల్లే జరిగిందని మస్క్ స్పష్టం చేశారు. ఇక ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ పరిణామాలపై కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దేశంలోకి వలస వస్తున్న నేరస్తుల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తాను గతంలో చెప్పిందే నిజమని న్యూఆర్లియన్స్ ట్రక్కు దాడి ఘటన నిరూపించిందన్నారు.