Israel: బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడి.. హిజ్బుల్లా కీలక నేత హతం
లెబనాన్ రాజధాని బీరూట్‌పై తాజాగా జరిపిన దాడిలో హిజ్బుల్లా ప్రధాన కార్యాలయం అధిపతి సుహైల్ హుస్సేనీని మట్టుబెట్టింది.
దిశ, నేషనల్ బ్యూరో: హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ మరో షాక్ ఇచ్చింది. లెబనాన్ రాజధాని బీరూట్‌పై తాజాగా జరిపిన దాడిలో హిజ్బుల్లా ప్రధాన కార్యాలయం అధిపతి సుహైల్ హుస్సేనీని మట్టుబెట్టింది. లెబనాన్‌లో జరిగిన దాడిలో హుస్సేనీ మరణించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) మంగళవారం తెలిపింది. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానాలు బీరూట్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని, ఈ దాడుల్లోనే హుస్సేనీ ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. ఇరాన్ నుంచి అధునాతన ఆయుధాలను తీసుకొచ్చి, వాటిని హిజ్బుల్లా యూనిట్లకు పంపిణీ చేయడంలో హుస్సేనీ ప్రమేయం ఉందని హిజ్బుల్లాలో ఆయన కీలక సభ్యుడని తెలిపింది. అయితే దీనిపై హిజ్బుల్లా అధికారికంగా స్పందించలేదు. అంతకుముందు అక్టోబర్ 3న పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన ముగ్గురు అగ్రనేతలను హతమార్చినట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. అందులో గాజా ప్రభుత్వ చీఫ్ రావి ముష్తాహా కూడా ఉన్నట్టు తెలిపింది.
లెబనాన్ ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలి: ఇజ్రాయెల్ వార్నింగ్
లెబనాన్‌లోని దక్షిణ తీర ప్రాంతంలో త్వరలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. లెబనీస్ ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలని సైన్యం సూచించింది. మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉన్న 60 కిలోమీటర్ల వరకు మత్స్యకారులు వెళ్లొద్దని హెచ్చరించింది. సోమవారం ఒక గంట వ్యవధిలో దక్షిణ లెబనాన్‌లోని 120కి పైగా హిజ్బుల్లా స్థావరాలపై అటాక్ చేసినట్టు తెలిపింది. మరోవైపు హిజ్బుల్లా పైతం ఇజ్రాయెల్‌పై 190 రాకెట్లను ప్రయోగించిందని, ఈ ఘటనలో 9 మంది గాయపడగా పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని తెలిపింది.
సజీవంగానే హమాస్ అధినేత యహ్యా సిన్వార్!
అక్టోబరు 7నాటి దాడుల్లో కీలక పాత్ర పోషించిన హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆయన బతికే ఉన్నట్టు పలు మీడియా కథనాలు తాజాగా వెల్లడించాయి. ఆయన ఖతర్‌తో రహస్య సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారని తెలుస్తోంది. హమాస్ అధినేత యహ్యా సిన్వార్ సజీవంగా ఉన్నారని ఓ సీనియర్ ఖతర్ దౌత్యవేత్త తన సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 21న హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దాడులు చేశాయి. ఆ దాడుల్లో22 మంది ప్రాణాలు కోల్పొగా అందులో సిన్వార్ కూడా మృతిచెంది ఉంటారని ఇజ్రాయెల్ భావించింది. అప్పటి సిన్వార్ దగ్గర్నుంచి ఎలాంటి ప్రకటన వెలుడవలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. సిన్వార్ ఈ ఏడాది ఆగస్టులో హమాస్ అధినేతగా నియామకమయ్యారు.
దాడులు చేస్తే ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఇరాన్ మరోసారి స్పందించింది. తమపై దాడులు చేస్తే సహించబోమని, తప్పకుండా ప్రతీకార దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా ప్రతీకారం తీర్చుకుంటామని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఎలాంటి దాడులు జరగకూడదని అదే జరిగితే పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. కాగా, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణానంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. నస్రల్లా మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. అప్పటినుంచి ఇజ్రాయెల్ ధీటుగా బదులివ్వబోతుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ స్పందించింది.
గాజాలో 17 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థానాలను లక్ష్యంగా చేసుకుని గాజాలోని శరణార్థి శిబిరంపై మంగళవారం జరిపిన దాడిలో చిన్నారులతో సహా 17 మంది మరణించినట్లు గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. సెంట్రల్ గాజా, ఉత్తర గాజా ప్రాంతాల్లో అనేక వైమానిక దాడులు చోటుచేసుకున్నాయని ఉన్నతాధికారి మహమూద్ బస్సల్ తెలిపారు. మరణించిన వారి మృతదేహాలను, క్షతగాత్రులను నుసిరత్ క్యాంప్‌లోని అల్-అవుదా ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు.