గాజా నగరాన్ని వీడాలని కరపత్రాలను రోడ్లపై పడేసిన ఇజ్రాయెల్
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను మరింత తీవ్రతరం చేస్తుంది.
దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను మరింత తీవ్రతరం చేస్తుంది. పాలస్తీనా భూభాగంలోని ప్రధాన నగరం గాజాపై ఇప్పటికే భీకర దాడులు చేస్తుండగా, తాజాగా నగరంలోని నివాసితులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని వేల కరపత్రాలను రోడ్లపై పడేసింది. దాడులు మరింత తీవ్రం అవుతాయి, ప్రజలందరు త్వరగా దక్షిణాన నిర్దేశించబడిన సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని రాసి ఉన్న కరపత్రాలను ఇజ్రాయెల్ సైన్యం బుధవారం గాజా నగరంపై పడవేసింది. ఇంతకుముందు జూన్ 27న నగరంలో కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేయగా, ఇప్పుడు మరోసారి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
నగరం తూర్పు షుజయా జిల్లాలో ఇజ్రాయెల్ దళాలు దాడిని ప్రారంభించినప్పటి నుండి దాదాపు పదివేల మంది నివాసితులు గాజా నగరం నుండి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఐక్యరాజ్యసమితి కూడా ఇజ్రాయెల్ ఆదేశాలపై గాజా నగర ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు ఈ దాడులను ఆపడానికి ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పటికే గాజా నగరం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ సైనిక దాడిలో గాజాలో కనీసం 38,243 మంది మరణించారు, వారిలో ఎక్కువ మంది పౌరులు కూడా ఉన్నారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.