Israel : ఏ క్షణమైనా లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సేన.. నెతన్యాహూ ఆదేశాలే తరువాయి!

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా భూతల దాడి చేసే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Update: 2024-09-27 17:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా భూతల దాడి చేసే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లెబనాన్ బార్డర్‌లో పెద్దఎత్తున మోహరించి ఉన్న ఇజ్రాయెలీ సైనిక బలగాలు, యుద్ధ ట్యాంకులే అందుకు నిదర్శనాలని అంటున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లతో భేటీ అయ్యాక లెబనాన్‌పై భూతల దాడి విషయంపై నెతన్యాహూ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు చేరుకున్న వెంటనే దీనిపై నెతన్యాహూ ప్రకటన చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ‘‘ఇప్పటికే గగనతలం, సముద్ర మార్గాల్లో లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా స్థావరాలపై మనం దాడులు చేస్తున్నాం. భూతల దాడిని చేసేందుకు మీరంతా సిద్ధంగా ఉండండి’’ అని ఇజ్రాయెలీ సైనికులకు ఇటీవలే రక్షణమంత్రి యోవ్ గెలెంట్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు లెబనాన్‌లో 700 మందికిపైగా చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు.

టెల్ అవీవ్‌పైకి హౌతీల మిస్సైల్

శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై యెమన్ హౌతీలు బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించారు. నగరంలోని గగనతలంపైకి చేరగానే దాన్ని ఇజ్రాయెలీ వాయుసేన కూల్చివేసింది. ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్ నగరంపై హౌతీలు డ్రోన్ దాడి చేశారు. గాజా, లెబనాన్‌పై దాడులు ఆపనన్ని నాళ్లు ఇజ్రాయెల్‌పై తమ దాడులు కొనసాగుతాయని హౌతీల నేత యహ్యా సారీ స్పష్టం చేశారు.

ఐరాస వేదికగా ఇరాన్‌కు నెతన్యాహూ వార్నింగ్

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం గత ఏడాది కాలంగా ఓపిక పడుతూ వచ్చాం. లెబనాన్‌లోని హిజ్బుల్లాను ఇక వదిలేది లేదు. దాన్ని తుద ముట్టించే సమయం వచ్చింది’’ అని చెప్పారు. తమ దేశ ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. ‘‘ఇరాన్ ఒకవేళ మాపై దాడి చేస్తే వదిలిపెట్టం. మేం కూడా ప్రతిదాడి చేస్తాం. ఇరాన్‌లోని అణువణువు మాకు బాగా తెలుసు’’ అని నెతన్యాహూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రసంగిస్తుండగానే ఇరాన్ సహా పలు దేశాల దౌత్యవేత్తలు సమావేశం నుంచి వాకౌట్ చేయడం గమనార్హం.


Similar News