Israel-Hezbollah: సీక్రెట్ బంకర్లను టార్గెట్ చేసుకున్న ఐడీఎఫ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను హత్యతో ఈ దాడులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను హత్యతో ఈ దాడులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హెజ్ బొల్లాకు చెందిన సీక్రెట్ బంకర్ (Secret Bunker)ను గుర్తించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. ‘‘హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో బంకర్‌ను ధ్వంసం చేశాం. అందులో భారీగా నగదు, బంగారాన్ని గుర్తించాం. ఇజ్రాయెల్‌పై దాడికి ఆ డబ్బునే వాడుతున్నారు. అంతేకాకుండా, బీరుట్ సిటీలో మరో సీక్రెట్ బంకర్ ఉంది. అల్-సాహెల్ ఆసుపత్రి కింద ఉన్న ఆ బంకర్‌లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. దానిపై మేం ఇంకా దాడి చేయలేదు’’ అని హగారీ తెలిపారు. ఆ బంకర్‌లో 500 బిలియన్ డాలర్ల నగదు (భారత కరెన్సీలో దాదాపు రూ.4,200కోట్లకు పైమాటే), బంగారం గుట్టలు ఉన్నట్లు అంచనా వేస్తున్నామని హగారీ తెలిపారు. ఈ సందర్భంగా బంకర్ ఉన్న ప్రాంతం మ్యాప్‌ను కూడా చూపించారు. ఈ ప్రాంతంపై తాము దృష్టిపెట్టినట్లు తెలిపారు. అయితే, తమ యుద్ధం హెజ్‌బొల్లాతో మాత్రమేనని, లెబనీస్ పౌరులతో కాదని మరోసారి స్పష్టం చేశారు.
అక్కడ దాడి చేయబోమన్న ఐడీఎఫ్
ఇకపోతే, సీక్రెట్ బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆసుపత్రిపై తాము దాడి చేయబోమనని ఐడీఎఫ్ తెలిపింది. దీంతో, అక్కడి అధికారులు హాస్పిటల్ ను ఖాళీ చేయిస్తున్నారు. హెజ్ బొల్లా ఆర్థిక కార్యకాలాపాలకు ఆర్థికంగా అండగా ఉండే ప్రజలు వెంటనే వెళ్లిపోవాలని ఐడీఎఫ్ ప్రకటించింది. లెబనాన్ వ్యాప్తంగా ఉన్న ‘అల్ ఖర్ద్ అల్ హసన్’ బ్రాంచీలను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. కాగా.. అల్ ఖర్ద్ అల్ హసన్ గ్రూపు హెజ్ బొల్లాకు నిధులు సమర్పిస్తోంది. దానికి దాదాపు 30 బ్రాంచీలు ఉన్నాయి. అవన్నీ బీరూట్ లోని రద్దీ ప్రాంతంలో ఉండటంతో ఆందోళనలు నెలకొన్నాయి.