గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి..27 మంది మృతి

గాజాపై దాడులు ఆపాలని అంతర్జాతీయ దేశాలు సూచిస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా గాజాలోని నుసిరత్‌లో ఉన్న ఓ పాఠశాలపై వైమాణిక దాడి చేసింది.

Update: 2024-06-06 04:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై దాడులు ఆపాలని అంతర్జాతీయ దేశాలు సూచిస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా గాజాలోని నుసిరత్‌లో ఉన్న ఓ పాఠశాలపై వైమాణిక దాడి చేసింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. స్కూల్‌లో హమాస్ మిలిటెంట్లు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారంతో అటాక్ చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గతేదాడి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకుంటున్నారని పేర్కొంది. దాడికి ముందు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అయితే యుద్ధం కారణంగా నిర్వాసితులైన ప్రజలకు పాఠశాల ఆశ్రయం కల్పిస్తోందని స్థానిక మీడియా వెల్లడించింది.

ఇజ్రాయెల్ వాదనలను హమాస్ సైతం తిరస్కరించింది. హమాస్ ఆధ్వర్యంలోని మీడియా కార్యాలయం డైరెక్టర్ ఇస్మాయిల్ అల్-తవాబ్తా మాట్లాడుతూ..ఇజ్రాయెల్ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని తెలిపారు. పాఠశాలలో స్థానభ్రంశం చెందిన ప్రజలు మాత్రమే ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. క్రూరమైన నేరాన్ని సమర్థించుకోవడానికే ఇజ్రాయెల్ సైన్యం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. కాల్పుల విరమణ చర్చల సమయంలో పోరాటానికి స్వస్తి పలకబోమని ఇజ్రాయెల్ ఇటీవలే వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే దాడులు జరగడం గమనార్హం. కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 36,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 


Similar News