Tesla Robotaxi & Robovan : టెస్లా నుంచి రోబో వ్యాన్.. సైబర్ ట్యాక్సీ.. ఆవిష్కరించిన ఎలాన్‌ మస్క్‌

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

Update: 2024-10-11 06:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా ఆయన రోబో వ్యాన్, రోబో టాక్సీల మోడల్స్‌ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘వీ రోబోట్’ కార్యక్రమంలో ఈ మోడల్స్‌ను ప్రకటించారు. రోబో వ్యాన్ సాధారణ డిజైన్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. రైలు ఇంజన్ వంటి డిజైన్‌తో తయారు చేయబడింది. రోబో వ్యాన్ బండి టైర్లు బయటకు కనిపించకుండా డిజైన్ చేశారు. వాహనం అడుగు భాగం భూమికి అతి తక్కువ ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ లేకుండా వాహనాన్ని తయారు చేశారు. ఈ వ్యాన్‌లో ఒకేసారి 20 మంది ప్రయాణికులను, సరుకులను తరలించేందుకు వాడుకోవచ్చని టెస్లా బృందం తెలిపింది. సెల్ఫ్ డ్రైవింగ్ మినీబస్‌‌గా ఈ రోబో వ్యాన్‌ను పలువురు అభివర్ణిస్తున్నారు.

అదేవిధంగా రోబో ట్యాక్సీని కూడా మస్క్ ఆవిష్కరించారు. రెండు డోర్లతో ఉన్న ఈ కారుకు స్టీరింగ్ వీల్ లేదు. దానిని సైబర్ క్యాబ్ అంటూ మస్క్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మోడళ్ల ఉత్పత్తిని 2026 నుంచి ప్రారంభిస్తామని మస్క్ వెల్లడించారు. దీని ధర రూ.25 లక్షల లోపే ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రతి మైలు ప్రయాణానికి 20 సెంట్లు ఖర్చు అవుతుందని మస్క్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మోడళ్లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Similar News