అతి త్వరలో ఇరాన్‌పై దాడి.. నెతన్యాహు సంచలన ప్రకటన

ఇజ్రాయెల్ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందని, ఏ క్షణానైనా ఇరాన్‌పై తాము దాడి చేస్తామని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.

Update: 2024-10-07 08:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందని, ఏ క్షణానైనా ఇరాన్‌పై తాము దాడి చేస్తామని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇప్పటికే పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్స్, లెబనాన్‌లోని హిజ్బుల్లాతో పోరాడుతున్న తమ సైన్యం త్వరలోనే ఇరాన్‌పై కూడా దాడి చేసి కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హమాస్‌పై దాడి ప్రారంభించి అక్టోబర్ 7తో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మా సైనికులు హమాస్‌కు వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్నారు. హైడ్‌ అవుట్స్‌లో ఉన్న ఉగ్రవాదులందరినీ కనిపెట్టి మట్టుబెడుతున్నాం. ఇప్పుడు మా దృష్టి నార్త్ వైపు మళ్లించాం. ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సైనిక చర్యను తీవ్రతరం చేస్తున్నాం. 12 నెలల్లో మేము చాలా మార్పు తీసుకొచ్చాం. అక్టోబరు 7న జరిగిన దాడిని హమాస్ ‘అద్భుతం’ అంటూ వ్యాఖ్యానించింది. వారి దాడిలో 1,205 మంది మరణించగా.. అర్థరాత్రి కూడా హైఫాపై సైతం హిజ్బుల్లా దాడికి దిగింది. మాపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. హిజ్బుల్లాని అంతం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు’’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అనంతరం ఇరాన్‌తో యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇరాన్ తమతో యుద్ధానికి కాలు దువ్విందని, దానికి తగినట్లే తాము కూడా త్వరలో బలమైన దాడి చేస్తామని స్పష్టం చేశారు. ఆ దేశంతో యుద్ధం జరిగినా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 


Similar News