పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. గురువారం ఉదయం 10 గంటల వరకు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయవద్దని లాహోర్ కోర్టు, పోలీసులను ఆదేశించింది.
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. గురువారం ఉదయం 10 గంటల వరకు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయవద్దని లాహోర్ కోర్టు, పోలీసులను ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను ఆయన ఇంటి నుంచి తరిమేందుకు పోలీసులు యుద్ధమే చేయాల్సి వచ్చింది. పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో ఇమ్రాన్ మద్దతుదారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో మాజీ ప్రధాని మద్దతు దారులపై వాటర్ క్యానాన్‌లను ఉపయోగించారు.
పలుమార్లు టియర్ గ్యాస్‌ను ప్రయోగించి వారిని ఆయన ఇంటి నుంచి పంపించివేసేందుకు ప్రయత్నించినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. ప్రముఖుల నుంచి బహుమతులు తీసుకున్న కేసులో 70 ఏళ్ల ఇమ్రాన్‌ను ఎన్నికల కమిషన్ దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో కోర్టుకు హాజరు కావాలని ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆయన మాత్రం హాజరు కాలేదు. దీంతో అవినీతి నిరోధక న్యాయస్థానం ఇమ్రాన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
బుధవారం మధ్యాహ్నం పోలీసులు గుంపు గుంపులుగా ఇమ్రాన్ ఇంటివైపుగా వచ్చారు. అయితే ‘ఇమ్రాన్‌కు హాని చేయడానికి వచ్చిన పోలీసులను, రేంజర్‌లను ప్రజలు తిప్పి పంపారు’ అని ఆయన అధికారిక పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. మద్దతు దారులు ఆయన ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు.
మరో వీడియోలో ఇమ్రాన్ మాస్క్ ధరించి తన అనుచరులను, కార్యకర్తలను కలిసేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చారు. 70 ఏళ్ల ఈ పొలిటీషియన్, క్రికెట్ లెజెండ్ తోషాఖానా కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు గతేడాది విదేశీ ప్రముఖుల నుంచి అక్రమంగా బహుమతులు తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. కోర్టుకు హాజరు కావాలని జారీ చేసిన సమన్లను నిర్లక్ష్యం చేయడంతో అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.
ఈ నెల మొదటి వారంలో కూడా ఇటువంటి డ్రామానే జరిగింది. అప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ వారెంట్‌తో ఇమ్రాన్ ఇంటికి వచ్చారు. కానీ అరెస్ట్ చేయలేకపోయారు. తనను అరెస్ట్ చేయడం లండన్ ప్లాన్‌లో భాగమని, ముందస్తు ఎన్నికల కోసం డిమాండ్ చేస్తున్న తనను మౌనంగా కూర్చోబెట్టడమే లక్ష్యమని ఖాన్ ఆరోపించారు. ‘ఇది లండన్ ప్లాన్‌లో భాగంగా నన్ను జైలులో పెట్టడానికి, పీటీఐని పడగొట్టడానికి, నవాజ్ షరీఫ్‌పై ఉన్న కేసులన్నీ కొట్టివేయడానికి అక్కడ ఒప్పందం కుదిరింది’ అని ఆయన చెప్పారు.
గతేడాది ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇమ్రాన్ ఖాన్ ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన వారసుడిగా ప్రధాని పదవిని చేపట్టిన షెహబాజ్ షరీఫ్ దీనిని తిరస్కరించారు.