భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకోండి: ముయిజ్జుకు మాజీ అధ్యక్షుడి సూచన

భారత్‌తో సంబంధాలను మెరుగు పర్చుకోవాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ప్రస్తుత ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జుకు సూచించారు.

Update: 2024-03-25 06:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో సంబంధాలను మెరుగు పర్చుకోవాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ప్రస్తుత ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జుకు సూచించారు. ముయిజ్జు తన మొండి వైఖరిని విడనాడాలని సలహా ఇచ్చారు. మాల్దీవులు ఆర్థిక సవాళ్లను ఎదుర్కుంటున్న నేపథ్యంలో భారత్‌తో సత్సంబంధాలు అత్యంత ముఖ్యమని చెప్పారు. మాఫన్నులో జరిగిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) కార్యక్రమంలో సోలిహ్ ప్రసంగించారు. ‘పొరుగు దేశాలు మాల్దీవులకు సహాయం చేస్తాయనే నమ్మకం ఉంది. కానీ మనం మొండిగా ఉండటం మానేసి, చర్చలు ప్రారంభించాలి. అనేక దేశాలు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ముయిజ్జు దీనిని ఇష్టపడం లేదు’ అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలని వెంటనే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పర్చుకోవాలని హితవు పలికారు. కాగా, మాల్దీవుల ఆర్థిక సమస్యలు పరిష్కరించడం భారత్‌ వల్ల కాదని ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సోలిహ్ సూచలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో సోలిహ్‌పై ముయిజ్జూ విజయం సాధించారు. అప్పటి నుంచి ముయిజ్జూ భారత్ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారు. అంతేగాక చైనాలో పర్యటించి పలు రక్షణ ఒప్పందాలు చేసుకున్నాడు. మాల్దీవులలోని భారత సైనిక సిబ్బందిని మే 10వ తేదీ నాటికి ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనే ముయిజ్జు భారత్‌పై విమర్శలు గుప్పించారు. మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లామొదట భారత్‌లో పర్యటించే సంప్రదాయం ఉంది. అయితే ముయిజ్జు ఇంత వరకు భారత్‌లో పర్యటించకుండా టర్కీ, చైనాలో పర్యటించారు. 

Tags:    

Similar News