Israel-Hamas: పోరాటం తీవ్రతరం చేస్తాం.. ఇజ్రాయెల్ కు హెజ్ బొల్లా, ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరంగా మారాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ (Yahya Sinwar)ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) హతమార్చడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరంగా మారాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ (Yahya Sinwar)ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) హతమార్చడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక సిన్వర్ మృతితో హెజ్ బొల్లా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటం తీవ్రతరం అవుతుందని హెజ్‌బొల్లా గ్రూప్ ప్రకటించింది. ఇరాన్ కూడా ఇదే విధంగా స్పందించింది. తమ ఎదురుదాడులు బలోపేతం అవుతుందని ఐక్యరాజ్యసమితికి ఇరాన్ మిషన్ తెలిపింది. పాలస్తీనా విముక్తి కోసం, యువత, చిన్నారులు అతడి బాటలో నడుస్తారని తెలిపింది. ఆక్రమణ, శత్రుత్వ ధోరణి ఉన్నంతకాలం ప్రతిఘటన కొనసాగుతుందని తెలిపింది. అమరులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకువెళ్తామని పేర్కొంది.
ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
కాగా.. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం సిన్వర్ సోదరుడిని మట్టుబెట్టేందుకు రెడీ అవుతోంది. సిన్వర్ సోదరుడు మహమ్మద్, ఇతర హమాస్ మిలిటరీ కమాండర్ల జాడ కోసం గాలిస్తున్నామని ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. హమాస్ అధినేత మరణం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఆయుధాలను వదిలి.. తమ బందీలను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం రేపే ముగిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా తమ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు వారు బయటకు వచ్చి జీవించేలా అవకాశం కల్పిస్తామన్నారు. లేదంటే వేటాడి మరీ హతమరుస్తామని హెచ్చరించారు. ‘‘బందీల కుటుంబాలకు నేను చెప్పేది ఒక్కటే. యుద్ధంలో ఇది ముఖ్యమైన ఘట్టం. మీవారు మీ ఇంటికి చేరుకునేవరకు ఈ పోరాటం కొసాగుతుంది’’ అని వెల్లడించారు.