Hassan Nasrallah: నస్రల్లా ఇకపై ఉగ్రవాదంలో ప్రజలను భయపెట్టలేడు

హెజ్‌బొల్లా (Hezbollah) చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హెజ్ బొల్లా గ్రూపే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది.

Update: 2024-09-28 10:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హెజ్‌బొల్లా (Hezbollah) చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హెజ్ బొల్లా గ్రూపే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షంకురిపించింది. ఈ దాడుల్లోనే హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా (Hassan Nasrallah) మరణించినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ వెల్లడించింది. సోషల్ మీడియా ‘ఎక్స్‌’ అకౌంట్ లో నస్రల్లా మృతి చెందాడని పోస్ట్ చేసింది. ‘‘నస్రల్లా ఇకపై ఉగ్రవాదంతో ప్రజలను భయపెట్టలేడు’’ అని రాసుకొచ్చింది. అటు ఇజ్రాయెల్‌ వార్‌ రూమ్‌ కూడా దీనిపై స్పందించింది. ‘ఆపరేషన్‌ న్యూ ఆర్డర్‌’ మిషన్‌ విజయవంతమైనట్లు వెల్లడించింది. అంతేకాకుండా నస్రల్లా కుమార్తె జైనబ్ కూడా మరణించింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆమె మరణించింది. కాగా.. అప్పట్నుంచే నస్రల్లాతో కమ్యూనికేషన్ కట్ అయినట్లు వార్తలు వచ్చాయి. కాగా.. ఇప్పుడేమో నస్రల్లా చనిపోయినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.

దాహియాపై దాడి

శుక్రవారం రాత్రి దక్షిణ లెబనాన్‌ (Lebanon)లోని దాహియాలోని అండర్ గ్రౌండ్ లో ఉన్న హెజ్ బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వైమానిక దాడులు చేసింది. అక్కడే నస్రల్లా ఇదే కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో భవనం పూర్తిగా ధ్వంసమైందని, ఇందులో నస్రల్లా సహా ఎవరూ బతికే అవకాశాలు లేవని అప్పుడు ఐడీఎఫ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పుడేమో అతడు మృతిచెందినట్లు ధ్రువీకరించింది. నస్రల్లా మరణ వార్తలపై హెజ్‌బొల్లా ఇంకా స్పందించలేదు. నస్రల్లా కుమార్తె మృతిని కూడా హెజ్‌బొల్లా గానీ, లెబనాన్‌ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. మరోవైపు, శనివారం ఉదయం కూడా లెబనాన్‌లోని బెకా వ్యాలీలో ఐడీఎఫ్‌ వైమానిక దాడులతో విరుచుపడింది. ఇక, బీరూట్ లో దాడులపై హెజ్ బొల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్ భూభాగాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది.


Similar News