చరిత్రలోనే మొదటిసారి.. బతికి ఉన్న మనిషికి పంది కిడ్నీ మార్పిడి

జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీని బతికి ఉన్న మనిషికి మార్పిడి చేయడంలో వైద్యులు మొదటిసారిగా విజయం సాధించారు.

Update: 2024-03-22 10:22 GMT

దిశ, ఫీచర్స్: రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది. చేయలేమనుకున్న పనులను కూడా చేసి చూపిస్తున్నారు. అమెరికాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీని బతికి ఉన్న మనిషికి మార్పిడి చేయడంలో వైద్యులు మొదటిసారిగా విజయం సాధించారు. ఈ ప్రయోగం వైద్యరంగంలో పెద్ద పురోగతికి కొత్త అవకాశాలను తెస్తుంది. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో నాలుగు గంటలపాటు జరిగిన ఆపరేషన్‌లో వైద్యులు ఈ ఫలితాన్ని సాధించారు. 1954లో ప్రపంచంలోనే మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఈ ఆసుపత్రిలో జరిగింది. ఈ పంది కిడ్నీని 62 ఏళ్ల రిక్ స్లీమాన్ కు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

చాలా ఏళ్లుగా మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న రిక్ స్లీమాన్ 2018లో మానవ మూత్రపిండ మార్పిడిని పొందారు. ఐదేళ్ల తర్వాత, మూత్రపిండ సమస్యలు మొదలయ్యాయి. 2023 నుంచి మళ్లీ డయాలసిస్ సమస్య కూడా మొదలైంది.గత ఏడాది పంది కిడ్నీ తీసుకోవాలని వైద్యులు చెప్పగా.. దీనికి రిక్ స్లేమాన్‌ ఓకే అని చెప్పడంతో అతనికి ఆపరేషన్ చేసారు.

బతికి ఉన్న వ్యక్తికి పంది అవయవాన్ని అమర్చడం ఇది మూడో కేసు. ఇప్పటికే రెండుసార్లు పంది గుండెను మానవులకు అమర్చిన విషయం మనకి తెలిసిందే. ఇద్దరు మాత్రం చాలా వారాల తర్వాత మరణించారు. అయితే ఇప్పుడు అమెరికా వైద్యుల బృందం ఈ కొత్త అద్భుతాన్ని సాధించింది. వైద్యులు ఈ రోగిని సంవత్సరాల తరబడి పర్యవేక్షిస్తున్నారు. ఈ పరీక్ష విజయవంతమైతే లక్షలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం చేకూరనుంది.


Similar News