ఇదెక్కడి వింత.. ఎడారిలో వరదలు

ప్రపంచంలోనే అత్యంత ఎడారి ప్రదేశమైన సహారాలో వరదలు సంభవించాయి. ఎన్నోఏళ్లుగా ఎండిపోయిన సరస్సు ఇప్పుడు నీటితో కళకళలాడుతోంది.

Update: 2024-10-09 08:43 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎడారి దేశంలో వరదలు.. కాస్త షాకింగ్ గా ఉన్నా ఇది నిజమే. తాగడానికి ఒక్క చుక్క నీరు దొరకడమే కష్టమైన ఎడారిలో వరదలొస్తాయని ఎప్పుడైనా ఊహించారా? అది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎడారిలో వరదలంటే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఇది నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతమే. మొరాకోలోని సహారా ఎడారి ప్రపంచంలోని అత్యంత పొడి ప్రదేశాల్లో ఒకటి. అలాంటి ఎడారిలో ఇంత భారీ వర్షం కురుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దీనిని చూసి అక్కడి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. గడిచిన 30-50 ఏళ్లలో సహారా ఎడారిలో ఇలాంటి వర్షం కురవడం చూస్తున్నామని పేర్కొన్నారు.

సహారా ఎడారి ప్రాంతంలో వేసవి తర్వాత సెప్టెంబరులో కురిసిన వర్షపాతం వార్షిక సగటు కంటే అధికమని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మొరాకో రాజధాని రబాత్ కు దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాగౌనైట్ అనే గ్రామంలో 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైందని, ఈ దృశ్యాన్ని చూసి.. పర్యాటకులు ఆశ్చర్యపోయారని పేర్కొంది. ఇసుక తిన్నెల మధ్య కనిపిస్తున్న సరస్సు.. అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. స్థానికులు సైతం ఆ వర్షాన్ని చూసి.. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు.

సహారా ఎడారి ప్రాంతంలో ఇంత తక్కువ సమయంలో అధికంగా కురిసిన వర్షాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు ఉష్ణమండల తుపానుగా పిలుస్తారు. రానున్న రోజుల్లో అక్కడి వాతావరణం మరింత మారవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గాలిలో తేమ పెరుగుతుండగా.. మరిన్ని తుపానులను చూడబోతున్నట్లు చెబుతున్నారు.

ఆరేళ్లుగా కరువు

ఎడారి ప్రాంతమంటేనే కరువు ప్రాంతం. నిత్యావసరాలకు కాదు కదా.. కనీసం దాహం తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకవు. మొరాకోలోని చాలా ప్రాంతాలు ఆరేళ్లుగా కరువుతో అల్లాడుతున్నాయి. నీరు లేక.. పంటలు పండక రైతులు పొలాలను బీడుగా వదిలేశారు. తాజాగా కురిసిన భారీ వర్షం.. రైతుల్లో కొత్త ఆశల్ని చిగురింపజేసింది. జగోరా - టాటా మధ్య 50 ఏళ్లుగా ఎండిపోయిన ప్రసిద్ధ ఇరికి సరస్సు వేగంగా నిండుతున్నట్లు నాసా ఉపగ్రహాలు చూపించాయి. 


Similar News