ఈ వ్యక్తికి పంది గుండె అమర్చారు... రెండు నెలల తర్వాత..?!
డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి జనవరి 7న గుండె మార్పిడి చేశారు. First Pig Heart transplantation in America, Patient died.
దిశ, వెబ్‌డెస్క్ః ఆధునిక వైద్య విజ్ఞానం నానాటికీ అభివృద్ధిచెందుతూనే ఉంది. అవయవ మార్పిడిలోనూ మెరుగైన పద్ధతులు రావడంతో ఎంతో మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. మనిషి అవయవాలను తీసి, మరో మనిషికి అమర్చడంలో వైద్యులు విజయం సాధించినప్పటికీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం, అవసరానికి తగిన ఆర్గాన్స్ లేకపోవడంతో వైద్య పరిశోధనలో ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంభిస్తున్నారు. వాటిలో భాగంగానే ఇటీవల అమెరికాలో 57 ఏళ్ల వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది గుండెను అమర్చారు. అయితే, కొన్నాళ్లు ఆరోగ్యంగానే ఉన్న వ్యక్తి రెండు నెలల తర్వాత బుధవారం మరణించినట్లు ఆపరేషన్ చేసిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సిస్టమ్ ఆసుపత్రి ప్రకటించింది.
'క్రాస్-స్పీసీస్' అవయవ మార్పిడితో పురోగతి వస్తుందని ఆశించిన వైద్యులకు ఈ మరణం కాస్త అసంతృప్తినే మిగిల్చింది. డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ ఏడాది జనవరి 7న గుండె మార్పిడి చేశారు. "ఆపరేషన్ తర్వాత, మార్చిన గుండె చాలా వారాల పాటు బాగా పనిచేసింది. బెన్నెట్ కుటుంబంతో ఆనందంగానే గడిపాడు. ఫిజికల్ థెరపీకి కూడా సహకరిస్తూ ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే, కొన్ని రోజుల క్రితం నుండి ఆయన పరిస్థితి క్షీణించడం మొదలయ్యింది" అని బెన్నెట్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన సర్జన్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. బెన్నెట్ కోలుకోలేడని నిర్థారించుకున్న తర్వాత డాక్టర్లు పెల్లియేటీవ్ కేర్ ప్రారంభించారు. చివరి వరకూ ధైర్యంగా, ప్రాణాలతో పోరాడిన బెన్నెట్ బుధవారం చివరి శ్వాస విడిచారు. దీనితో, మనిషికి జంతువుల అవయవాలను అమర్చే ప్రయోగంలో మరోసారి నిరాశ ఎదురయ్యింది.