రష్యా రక్షణ మంత్రి తొలగింపు: పుతిన్ కీలక నిర్ణయం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ దేశ రక్షణ మంత్రిగా ఉన్న సెర్గీ షోయిగును తొలగించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ దేశ రక్షణ మంత్రిగా ఉన్న సెర్గీ షోయిగును తొలగించారు. ఆయన స్థానంలో నూతన ఢిపెన్స్ మినిస్టర్‌గా మాజీ ఉప ప్రధాని ఆండ్రీ బెలౌసోవ్‌ను నియమించారు. అలాగే షోయిగును భద్రతా మండలి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, 2012 నుంచి షోయిగు రక్షణ మంత్రిగా ఉన్నారు. ఉక్రెయిన్ తో ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి కీలకంగా వ్యవహరించారు. దీంతో పుతిన్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక మాజీ ఆర్థిక మంత్రి అయిన బెలౌసోవ్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు గాంచారు. యుద్ధ పరమైన విషయాల కంటే ఆర్థిక పరమైన అంశాల్లో బెలౌసోవ్‌కు అపార అనుభవం ఉంది. రష్యా డ్రోన్ ప్రోగ్రామ్‌ను పర్యవేక్షించడంలో బెలౌసోవ్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. దీంతో బలమైన దేశాన్ని పునర్ నిర్మించాలనే ఆలోచనతోనే పుతిన్ బెలౌసోవ్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు క్రెమ్లిన్ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఆలోచనలతో బెలౌసోవ్ ముందుకు వెళ్తారని తెలిపింది. అమితే దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా మార్చనున్నారని కథనాలు వెలువడగా..దానిపై క్రెమ్లిన్ స్పందించింది. లావ్రోవ్ తన పదవిలో కొనసాగుతారని తెలిపింది.
క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ..1980ల మధ్యకాలంలో సోవియట్ యూనియన్ వంటి పరిస్థితి రష్యాకు ప్రస్తుతం ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందుకే సైన్యం, చట్టాన్ని అమలు చేసే అధికారులు రాష్ట్ర వ్యయంలో 7.4శాతం వాటాను కలిగి ఉన్నందున ఈ మార్పులు చేసినట్టు తెలిపారు. ‘అటువంటి ఖర్చు దేశం మొత్తం ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమైంది. అందుకే రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగంలో ఆర్థిక నేపథ్యం ఉన్న పౌరుడిని నియమించుకోవాలని పుతిన్ కోరుకున్నారు’ అని తెలిపారు. ఆవిష్కరణలకు మరింత ఓపెన్‌గా ఉన్న వ్యక్తి యుద్ధభూమిలో విజయం సాధిస్తాడని స్పష్టం చేశారు.