ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో డేటింగ్ అవాస్తవం : ఎల‌న్ మ‌స్క్

సెలబ్రిటీలు ఏం చేసిన వార్తనే అన్నట్లుగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రముఖ బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌ దిగిన ఫోటో గాసిప్స్ కు వేదికైంది

Update: 2024-09-25 10:35 GMT

దిశ, వెబ్ డెస్క్ :  సెలబ్రిటీలు ఏం చేసిన వార్తనే అన్నట్లుగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రముఖ బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌ దిగిన ఫోటో గాసిప్స్ కు వేదికైంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మస్క్ దిగిన ఫోటో ఒక‌టి వైర‌ల్ అయ్యింది. దీంతో ఆ ఫోటో పై గాసిప్స్ గుప్పుమ‌న్నాయి. ఫోటోలో వారిద్దరి సాన్నిహిత్యం చూసి వారు డేటింగ్‌లో ఉన్నట్లుగా సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు చెలరేగాయి. ఆ మధ్య న్యూయార్క్‌లో జరిగిన ఓ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబ‌ల్ సిటిజ‌న్ అవార్డును మెలోనీకి మస్క్ అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రధాని మెలోనికి అవార్డును అంద‌జేయ‌డం గ‌ర్వంగా భావిస్తున్నానంటునే క‌నిపించే అందం క‌న్నా..ఆమె మ‌న‌సు మ‌రింత అంద‌మైంద‌ంటూ, న‌మ్మకమైందంటూ పొగడ్తలు కురిపించారు.

మస్క్ మాటలు..వారిద్దరి మధ్య సాన్నిహిత్యం చూసి వారిద్దరు డేటింగ్ లో ఉన్నారన్న ప్రచారం చోటుచేసుకుంది. దీనిపై తాజాగా ఎల‌న్ మ‌స్క్ స్పందిస్తూ జార్జియా మెలోనీని అభిమానిస్తానని, ప్రధానిగా ఆమె ఇట‌లీ కోసం ఎంతో చేశార‌న్నారు. రాజ‌కీయాల్లో మెలోని వంటి విశ్వసనీయ వ్యక్తులు త‌క్కువ అన్నారు. త‌మ మ‌ధ్య డేటింగ్ జ‌ర‌గ‌డం లేద‌ంటూ డేటింగ్ రూమర్లను కొట్టివేశారు. మ‌స్క్ చేసిన పోస్టుకు.. మెలోనీ కూడా త‌న ఎక్స్ అకౌంట్‌లో థ్యాంక్స్ తెలిపారు.

కాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని పొగడటం వెనుక ఎలన్ మస్క్ కు ఇటలీలో వ్యాపార ప్రయోజనాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటలీ జూన్‌లో కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించింది, ఇది విదేశీ అంతరిక్ష కంపెనీలకు దేశంలో పనిచేయడానికి అనుమతిని మంజూరు చేసింది. ఇటలీ ఇప్పటికే మస్క్ యొక్క స్టార్‌లింక్ ద్వారా సేవలు అందిస్తోంది. ఇది అతని స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్ప్ ద్వారా నిర్వహించబడుతున్న 6,000 కంటే ఎక్కువ ఉపగ్రహాల గ్లోబల్ నెట్‌వర్క్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది.


Similar News