అమెరికాలో చైనా సీక్రెట్ వైరస్ ల్యాబ్..

అమెరికాలో నడుస్తున్న చైనా సీక్రెట్ వైరస్ ల్యాబ్ బయటపడింది.

Update: 2023-08-02 11:04 GMT

వాషింగ్టన్ : అమెరికాలో నడుస్తున్న చైనా సీక్రెట్ వైరస్ ల్యాబ్ బయటపడింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని రీడ్లీ సిటీలో దీన్ని గుర్తించారు. చైనాకు చెందిన ఒక బయోటెక్ కంపెనీ నడుపుతున్న ఆ ల్యాబ్‌లో వందలకొద్దీ ప్రమాదకర వైరస్‌లతో ప్రయోగాలు చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ విషయం తెలియడంతో రీడ్లీ సిటీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ ల్యాబ్‌లో కరోనా వైరస్, మలేరియా వైరస్, హెచ్‌ఐవీ వైరస్, హెపటైటిస్ వైరస్, స్పృహలేని స్థితిలో 1000 ఎలుకలు, 200 చనిపోయిన ఎలుకలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. వందలకొద్దీ కుండలలో వైరస్‌లను నింపి ఇండస్ట్రియల్ ఫ్రీజర్‌లలో నిల్వచేసి ఉంచారని అమెరికా ప్రభుత్వ అధికారులు కనుగొన్నారు. “ప్రెస్టీజ్ బయో టెక్” పేరుతో కాలిఫోర్నియా రాష్ట్రంలోని రీడ్లీ సిటీలో చైనాకు చెందిన ఒక డయాగ్నస్టిక్ ల్యాబ్ ఏర్పాటైంది.

అందులో స్థానికులకు కరోనా టెస్టులు, ప్రెగ్నెసీ టెస్టులు చేసేవారు. ఆ చైనా ల్యాబ్ బిజినెస్ చేస్తోందని అందరూ భావించారు. కానీ ఆ ల్యాబ్ సెల్లార్ లోపలి నుంచి బయటికి గ్యాస్ రిలీజ్ అయ్యేందుకు ఒక గొట్టాన్ని అమర్చడంతో ఆరోగ్య విభాగం అధికారులకు అనుమానం వచ్చింది. వారు వెళ్లి తనిఖీ చేయగా.. డయాగ్నస్టిక్ ల్యాబ్ మాటున ప్రమాదకర వైరస్ లతో రీసెర్చ్ చేసే ల్యాబ్ నడుస్తోందని బట్టబయలైంది. బిల్డింగ్‌లోని సెల్లార్ భాగంలో సీక్రెట్ ల్యాబ్‌ను నడిపిస్తున్నారని తేలింది. ఈ డయాగ్నస్టిక్ ల్యాబ్‌కు కాలిఫోర్నియాలో బిజినెస్ చేసే పర్మిషన్స్ లేవని అధికారులు చెప్పారు.


Similar News