కాల్పుల విరమణ చర్చలు విఫలం: హమాస్‌కు ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరిక
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన చర్చలకు ఈజిప్టు, ఖతర్‌లు మధ్యవర్తిత్వం వహించాయి.
దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన చర్చలకు ఈజిప్టు, ఖతర్‌లు మధ్యవర్తిత్వం వహించాయి. అయినప్పటికీ ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు. హమాస్ ప్రతిపాదనలకు ఇజ్రాయెల్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందించారు. హమాస్ డిమాండ్లలో పారదర్శకత లేదని స్పష్టం చేశారు. గాజాలోని రఫా నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో సైనిక చర్య మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. హమాస్ ఉద్దేశాలు సరిగా లేవని తెలిపారు. అయితే మంగళవారం హమాస్ ప్రతినిధి బృందం మరోసారి చర్చలకు రానున్నట్టు తెలుస్తోంది. చర్చల్లో పురోగతి ఉందని పలు కథనాలు వెల్లడించినప్పటికీ అవి విఫలం కావడంతో మరోసారి ఆందోళన నెలకొంది.
హమాస్ దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఈజిప్టులో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే గాజాలోని కెరెమ్ షాలోమ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద హమాస్ రాకెట్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా..మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 14రాకెట్లతో దాడి చేసినట్టు పేర్కొంది. ఈ అటాక్‌కు హమాస్ బాధ్యత వహించింది. అయితే హమాస్ రాకెట్ దాడి చేసిన కొన్ని గంటల తర్వాత రఫా నగరంలో ఇజ్రాయెల్ వైమాణిక దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది, ఈ దాడిలో 16 మంది మరణించినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు, మరో ఫ్యామిలీకి చెందిన తొమ్మిది మంది ఉన్నారని తెలిపారు. అనంతరం గాజాలోకి ప్రవేశించే క్రాస్ బార్డర్‌ను ఇజ్రాయెల్ మూసి వేసింది.
గాజాలో తీవ్రం కానున్న మానవతా సంక్షోభం
కాల్పుల విరమణ చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ రఫాపై దాడులు కొనసాగిస్తుండటంతో గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమవనుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మానవతా సాయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అంతేగాక ఇప్పటికే ముద్ధంలో 34,500కు పైగా పాలస్తీనియన్లు మరణించారు. అయితే అనేక మంది నివసించే రఫాపై ఇజ్రాయెల్ సైనిక చర్య కొనసాగితే భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిపై ఐక్యరాజ్యసమికి కూడా హెచ్చరికలు జారీ చేసింది.