Ceasefire: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య 21 రోజుల కాల్పుల విరమణ.. యూఎస్, ఫ్రాన్స్ ప్రతిపాదన !

ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్‌లు కీలక ప్రతిపాదన చేశాయి.

Update: 2024-09-26 09:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్‌లు కీలక ప్రతిపాదన చేశాయి. ఇరువురి మధ్య 21 రోజుల కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు తాజాగా జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ ప్రతిపాదనను వెల్లడించాయి. ‘లెబనాన్‌లో ఇటీవలి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాంతీయ భద్రతకు ఇది ఎంతో ప్రమాదకరం. కాబట్టి ఇజ్రాయెల్-హిజ్బొల్లా మధ్య 21 రోజుల కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నాం’ అని తెలిపాయి. తాత్కాలిక కాల్పుల విరమణను వెంటనే ఆమోదించాలని, దీనిపై ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో దీర్ఘకాలిక స్థిరత్వానికి దారితీస్తుందని అమెరికా భావిస్తోంది.

అయితే ఇజ్రాయెల్, లెబనీస్ ప్రభుత్వాల నుంచి దీనిపై ఎటువంటి స్పందనా రాలేదు. మరోవైపు యూఎస్ అధికారులు హిజ్బొల్లా కాల్పుల విరమణపై సంతకం చేయబోరని, కానీ లెబనీస్ ప్రభుత్వంతో అంగీకారాన్ని సమన్వయం చేస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ స్వాగతిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందం ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంతేగాక ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం కోసం నిలిచిపోయిన చర్చలను పునఃప్రారంభించడానికి సైతం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.  


Similar News