Sunita Williams: డేంజర్‌లో సునీతా విలియమ్స్‌.. ఆస్ట్రోనాట్స్ లేకుండానే తిరిగొచ్చిన స్పేస్‌షిప్

స్టార్‌లైనర్ స్పేష్‌షిప్ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగొచ్చింది.

Update: 2024-09-07 13:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) 3 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ (International Space Station)లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బోయింగ్ చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ (Boeing Starliner) స్పేస్‌షిప్ ద్వారా జూన్‌ 5న సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. అయితే ప్రయాణ సమయంలోనే స్పేస్‌షిప్‌లో హీలియం లీక్‌ కావడంతో ప్రోపల్షన్‌ వ్యవస్థలో లోపాలు తలెత్తాయి. వాల్వ్‌లో టెక్నికల్ సమస్యలు బయటపడ్డాయి. అయితే ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఎలాగోలా జూన్‌ 6న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు. అయితే 10 రోజుల ట్రిప్‌ తర్వాత జూన్‌ 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు (Technical Issues) తలెత్తడంతో అది సాధ్యం కాలేదు. దీంతో అప్పటి నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఇద్దరూ ఐఎస్ఎస్‌లోనే చిక్కుకున్నారు.

కాగా తాజాగా స్టార్‌లైనర్ స్పేష్‌షిప్ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగొచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెలవారుజామున 12.01 గంటలకు న్యూ మెక్సికోలోని వైట్‌ స్యాండ్స్‌ స్పేస్‌ హార్బర్‌కు ఖాళీ క్యాప్సుల్‌ భూమిపై ల్యాండ్ అయింది. వ్యోమగాములు లేకుండానే ఆటోపైలట్‌ పద్ధతిలో క్యాప్స్యూల్‌ను భూమి మీద దింపినట్లు నాసా తెలిపింది.

ఇదిలా ఉంటే ఐఎస్ఎస్‌లో ఇప్పటికే సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు నాసా పేర్కొంది. ఆమె శరీరంలో స్పందనలు తగ్గిపోతున్నాయని, కండరాలు సడలుతున్నాయని వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమెను త్వరగా భూమికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరో మానవసహిత నౌకను అంతరిక్షంలోకి పంపి వారిని తిరిగి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.


Similar News