చైనాలో ఆకాశం ఎర్ర‌బ‌డింది.. అంతం ముంచుకొస్తుందంటున్న నెటిజ‌న్లు! (వీడియో)

ఈ ఎర్రటి ఆకాశం 'సాతాను' సృష్టించింద‌ని అన్నారు. Blood-red sky visible in China’s Zhoushan.

Update: 2022-05-11 07:35 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః సృష్టిలో ప్ర‌తి దానికి ఒక అంతం ఉంటుందనేది తాత్విక స‌త్యమే! కానీ, ప్ర‌కృతిలో వైవిధ్య‌మైన మార్పులు ఏవి క‌నిపించినా వాటిని అంతంతో ముడిపెట్టడం అల‌వాట‌య్యింది. దీనికి కార‌ణం, నాశ‌నానికి సూచిక‌లు చెప్పిన‌ అల‌నాటి బోధ‌కుల మాట‌లు మ‌నుషుల మైండ్‌లో తిష్ట‌వేసుకోవ‌డ‌మే. ఆకాశంలో చంద్రుడు, మేఘాలు వివిధ రంగుల్లో కనిపించే అనేక అరుదైన అంతరిక్ష దృగ్విషయాలు మామూలే అయినా, ఆకాశ‌మంతా ఎర్ర‌బ‌డ‌టం అరుదుగానే క‌నిపిస్తుంది. ఇటీవ‌ల‌ చైనాలో ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ఈ వీడియోలు చూసిన నెటిజ‌న్లు అంతం ముంచుకొస్తుందంటూ సోష‌ల్ మీడియాలో సోకాలు పెట్టారు.

మే 7న చైనాలోని జౌషాన్ ప్రాంతంలో ఓ సాయంత్రం సమయంలో ఆకాశం రక్తపు ఎరుపు రంగులోకి మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించాయి. ఆకాశంలో ఏర్ప‌డిన‌ ఇంత విచిత్రమైన, అసాధారణమైన సంఘ‌ట‌న‌ వెనుక కారణాన్ని నెటిజన్లు వివిధ ర‌కాలుగా ఊహించారు. న‌గ‌ర సమీపంలో ఏదో కాలిపోతున్న‌ మంటల కారణంగా ఆకాశం రంగు మారింద‌ని కొందరు అనుకున్నారు. మరికొందరు దీనిని 'డూమ్స్‌డే' అని పిలిచారు. ప్రపంచం అంతం దగ్గర పడింద‌ని, ఆకాశపు రంగు ప్రళయాన్ని సూచిస్తుందని, ఈ ఎర్రటి ఆకాశం 'సాతాను' సృష్టించింద‌ని అన్నారు.

చివరగా, నిపుణులు చైనాలోని జౌషాన్ నగరంలో ఆకాశం ఎరుపు రంగు పులుముకోడానికి వెనుక కారణాన్ని వివరించారు. పసిఫిక్ సారీ చేపలను పండిస్తున్న ఫిషింగ్ బోట్ కారణంగా ఎరుపు రంగు వచ్చిందని నిపుణులు తెలిపారు. ఈ ఫిషింగ్ బోట్ నుండి ఎరుపు కాంతి ఆకాశంలో వక్రీభవనానికి గురికావ‌డం వ‌ల్ల ఆకాశ‌మంతా ఎర్ర‌టి కాంతి ప‌రుచుకుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌, ఈ ప్రాంతంలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని, క‌నుక‌ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక వాతావరణ నిపుణులు కూడా ధృవీకరించారు. 


Similar News