నాకు ప్రధాని పదవొద్దు.. మా నాన్న ప్రెసిడెంటైతే చాలు : బిలావల్
దిశ, నేషనల్ బ్యూరో : ఇప్పటికిప్పుడు దేశ ప్రధానమంత్రి కావాలనే దురాశ తనకు లేదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ స్పష్టం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఇప్పటికిప్పుడు దేశ ప్రధానమంత్రి కావాలనే దురాశ తనకు లేదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ స్పష్టం చేశారు. తగినంత మెజారిటీతో తన రాజకీయ పార్టీ గెలిచినప్పుడే ప్రధానమంత్రి పదవిని చేపడతానని ఆయన తేల్చి చెప్పారు. ‘‘మూడేళ్ల పాటు నవాజ్ షరీఫ్ (పీఎంఎల్ -ఎన్ పార్టీ).. రెండేళ్ల పాటు నేను దేశ ప్రధానమంత్రిగా వ్యవహరించే ఫార్ములాను ఇటీవల ప్రతిపాదించారు. అయితే నేను అందుకు నో చెప్పాను. ప్రధాని పదవి అక్కర్లేదన్నాను. ప్రజాబలం లభించినప్పుడే, సరిపడా సీట్లు సాధించినప్పుడే ప్రధాని అవుతానని తెలిపాను’’ అని బిలావల్ భుట్లో పేర్కొన్నారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో 54 సీట్లను సాధించిన పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసందర్భంగా సింధ్ ప్రావిన్స్‌లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. నవాజ్ షరీఫ్ పార్టీని తాము మంత్రి పదవులు కూడా డిమాండ్ చేయలేదని బిలావల్ వెల్లడించారు. అయితే తన తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీని పీపీపీ తరఫున దేశాధ్యక్ష అభ్యర్థిగా నిలుపుతామని చెప్పారు. దేశ పరిస్థితులను గాడిన పెట్టేందుకే ఆసిఫ్ అలీ జర్దారీని అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని తెలిపారు.