సగానికి సగం సీట్లలో హసీనా పార్టీ లీడ్.. 40 శాతం పోలింగే ఎందుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా నమోదైంది.

Update: 2024-01-07 18:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా నమోదైంది. ఆదివారం రోజు జరిగిన ఓట్ల పండుగలో 40 శాతమే ఓటింగ్ జరిగింది. అంటే.. దేశంలోని దాదాపు 12 కోట్ల మంది ఓటర్లలో 4.80 కోట్ల మందే ఓటు వేసినట్టు లెక్క. ప్రధానమంత్రి షేక్ హసీనా పాలనా వైఖరిని వ్యతిరేకిస్తూ శని, ఆదివారాల్లో (జనవరి 6, 7 తేదీల్లో) సార్వత్రిక సమ్మెకు ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఇచ్చిన పిలుపు ఎఫెక్టు వల్లే పోలింగ్ శాతం పడిపోయిందని అంటున్నారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ బీఎన్‌పీ శ్రేణులు చేసిన ప్రచారం కూడా ప్రభావవంతంగా పనిచేసిందని చెబుతున్నారు. అందుకే ఓట్లు వేసేందుకు జనం పెద్దగా పోలింగ్ కేంద్రాలకు రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు పోలింగ్ జరుగుతుండగానే చంద్‌గావ్, చత్తాగ్రామ్ (చిట్టగాంగ్)లలో పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్‌పీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఓటర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమను నిలువరించేందుకు యత్నించిన పోలీసులతో బీఎన్‌పీ కార్యకర్తలు ఘర్షణకు పాల్పడ్డారు. దేశంలోని కొన్నిచోట్ల పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ జరిగిందనే వార్తలు కూడా స్థానిక మీడియాలో వచ్చాయి.

266 పార్లమెంటు స్థానాల్లో..

ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొదలైంది. సోమవారం మధ్యాహ్నంలోగా మొత్తం ఎన్నికల ఫలితాల తీరుతెన్నులపై క్లారిటీ వచ్చేస్తుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, అవామీ లీగ్ పార్టీ చీఫ్ షేక్ హసీనా(76) పోటీచేసిన గోపాల్‌గంజ్-3 నియోజకవర్గం ఫలితం ఆదివారం రాత్రే విడుదలైంది. అక్కడి నుంచి ఆమె మరోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. హసీనాకు అత్యధికంగా 249,965 ఓట్లు రాగా, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన సమీప ప్రత్యర్థి ఎం.నిజాముద్దీన్‌కు కేవలం 469 ఓట్లు వచ్చాయి. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగిన 300 పార్లమెంటు స్థానాలకుగానూ 266 చోట్ల షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ అభ్యర్థులను నిలిపింది. మిగతా సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది. ఆదివారం అర్ధరాత్రి సమయానికి బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. సగానికి సగం పార్లమెంటు స్థానాల్లో అవామీ లీగ్ పార్టీ అభ్యర్థులే లీడ్‌లో ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. కాగా, బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం మొబైల్ యాప్‌పై ఉక్రెయిన్, జర్మనీలకు చెందిన హ్యాకర్లు ఆదివారం మధ్యాహ్నం సైబర్ దాడి చేశారు. దీంతో ఆ యాప్ సేవలు కాసేపు నెమ్మదించాయి.

ఓటు వేశాక.. ఇండియాకు థ్యాంక్స్ చెప్పిన హసీనా

భారత్‌పై బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. ఆదివారం ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘భారత్ మాకు నమ్మకమైన మిత్రదేశం. లిబరేషన్ వార్ టైంలో మాకు మద్దతిచ్చారు. 1975 తర్వాత మేము సర్వం కోల్పోయినప్పుడు కూడా వారు మాకు ఆశ్రయం ఇచ్చారు. ఇండియాకు మా ధన్యవాదాలు’ అని చెప్పారు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలోనూ బంగ్లాదేశ్ ప్రజలకు భారతదేశం ఆశ్రయమిచ్చిందని గుర్తు చేశారు. 

రెండు రోజుల ముందు.. రెండు ఘటనలు..

పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు (5వ తేదీన) చోటుచేసుకున్న పలు ఘటనలు కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈనెల 5న రాజధాని ఢాకాకు సమీపంలోని రైల్వే స్టేషనులో కొందరు దుండగులు పశ్చిమ బెంగాల్ బార్డర్ నుంచి వచ్చిన ఒక ట్రైనుకు నిప్పు పెట్టారు. దీంతో దాదాపు రెండు, మూడు బోగీలకు మంటలు వ్యాపించి ఐదుగురు సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. అదే రోజున దాదాపు 7 పోలింగ్ కేంద్రాలకు కూడా కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. ఇలాంటి ఘటనలతో ఏర్పడిన అభద్రతా భావం ప్రజలను ఓటింగ్‌కు దూరం చేసిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

Tags:    

Similar News