భారత మత్య్సకారుల అరెస్టు: 21 మందిని అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ
శ్రీలంక నేవీ మరోసారి 21 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసి..రెండు పడవలను సీజ్ చేసింది. తమిళనాడులోని రామేశ్వరం నుంచి చేపలు పట్టేందుకు 480కి పైగా పడవల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక నేవీ మరోసారి 21 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసి..రెండు పడవలను సీజ్ చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని రామేశ్వరం నుంచి చేపలు పట్టేందుకు 480కి పైగా పడవల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. శనివారం రాత్రి వారు అప్పడీవు, నెదుందీవుల మధ్య ఉన్న పాల్క్ బే ప్రాంతంలో మత్య్సకారులు చేపలు పడుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక నేవీ వారి వద్దకు వచ్చి 21 మంది మత్య్సకారులను అదుపులోకి తీసుకుంది. రెండు పడవలను సీజ్ చేసింది. సరిహద్దు ఆవల నుంచి చేపలు పట్టేందుకు వచ్చామని మత్స్యకారులు చెప్పడంతో వారిని శ్రీలంక నేవీ విచారణ నిమిత్తం కంగేసంతురై నేవల్ బేస్‌కు తీసుకెళ్లింది. దీంతో రామేశ్వరం మత్స్యకారుల్లో ఆందోళన నెలకొన్నట్టు రామేశ్వరం మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు దేవదాస్ తెలిపారు.
అంతకుముందు గతేడాది అరెస్టు చేసిన నలుగురు మత్స్యకారులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామనాథపురంలో నలుగురు మత్స్యకారుల కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. డిసెంబర్ 2023లో నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో తమ వారిని తప్పుగా ఇరికించారని ఆరోపించారు. రామనాథపురం జిల్లా తిరుప్పలైకుడికి చెందిన శేషు, కార్తీక్ అనే నలుగురు మత్స్యకారులు, మోర్పన్నై ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు సంతూరు, పాసిపట్టణం ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్ అనే మత్స్యకారుడిని 2023 డిసెంబర్ 5న అరెస్టు చేశారు. వీరంతా కువైట్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. కాగా, మత్స్యకారుల విడుదలకు జోక్యం చేసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.