ఆల్ షిఫా ఆస్పత్రిపై మరోసారి ఆపరేషన్: వెల్లడించిన ఇజ్రాయెల్
గాజాలోని ఆల్ షిఫా ఆస్పత్రిపై ఆపరేషన్ ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ప్రకటించింది. ఈ ఆస్పత్రిని హమాస్‌కు చెందిన సీనియర్ ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది.
దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని ఆల్ షిఫా ఆస్పత్రిపై ఆపరేషన్ ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ప్రకటించింది. ఈ ఆస్పత్రిని హమాస్‌కు చెందిన సీనియర్ ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. ఇజ్రాయెల్ సైనికులు ప్రస్తుతం ఆస్పత్రి ప్రాంగణంలో మోహరించినట్టు వెల్లడించింది. హమాస్ టెర్రరిస్టులు ఆస్పత్రిలో తలదాచుకున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారం మేరకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఆస్పత్రి చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం ట్యాంకులను మోహరించిందని స్థానిక కథనాలు వెల్లడించాయి. ఆల్ షిఫా ఆస్పత్రి గాజాలోనే అతిపెద్ద హాస్పిటల్.. ఇజ్రాయెల్ సైన్యం గతేడాది నవంబర్‌లో అక్కడ ఓ ఆపరేషన్ నిర్వహించగా అంతర్జాతీయంగా ఆందోళనలు రేకెత్తాయి. దీంతో తాజాగా మరోసారి సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమవడంతో ఆందోళనలు పెరిగాయి. కాగా, ఆస్పత్రుల నుంచి హమాస్ సైనిక కార్యకలాపాలను నడుపుతోందని ఇజ్రాయెల్ పదేపదే ఆరోపిస్తోంది.