మోనాలిసాపై దానితో దాడి.. ఇందుకే చేశాన‌న్న యువ‌కుడు! (వీడియో)

మోనాలిసాను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. Man Disguised As Elderly Woman Smears Mona Lisa Portrait With Cake.

Update: 2022-05-31 10:42 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః మోనాలిసా పేరు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత పెయింటింగ్‌ల‌ల్లో నెంబ‌ర్ వ‌న్ పాపుల‌ర్ స్థానం దీనికే సొంతం. 15వ శ‌తాబ్ధంలో లియోనార్డో డావిన్సీ వేసిన ఈ పెంయింటింగ్ ఇప్పుడు పారిస్‌లోని లౌర్వ్ మ్యూజియంలో, క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌లో, కళాభిమానుల కోసం ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. అయితే, ఆదివారం మోనాలిసా పెయింటింగ్‌పై ఓ వ్య‌క్తి దాడికి పాల్ప‌డ్డాడు. దాని కోసం "వృద్ధ మహిళ"గా వేషం వేసుకొని, వీల్‌చైర్‌లో నుండి ఒక్క‌సారిగా పెయింటింగ్ పైకి దూకడంతో అక్క‌డున్న‌వారంతా ఆశ్చర్యపోయారు. వెంట‌నే, ఆ దుండ‌గుడు ప్రముఖ పెయింటింగ్‌పై కేక్ క్రీమ్‌ను పులిమాడు. దీనికి సంబంధించిన‌ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, నేరస్థుడు విగ్ ధరించి, వీల్ చైర్‌లో వ‌చ్చాడు. వీల్ చైర్‌లో ఉన్న‌వారికి పెయింటింగ్‌ల‌ దగ్గరికి వెళ్లి చూసే వెసులుబాటు ఉండ‌టంతో, అత‌డు మోనాలిసా ద‌గ్గ‌ర వ‌ర‌కూ వెళ్లాడు. మొద‌ట‌ డిస్ ప్లే కేస్‌ను ధ్వంసం చేయ‌డానికి ప్రయత్నించాడు. అది పని చేయకపోవడంతో, అతను కేక్‌ను కాన్వాస్‌పైకి విసిరి, గ్లాస్ ప్యానెల్‌పై రుద్దాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన‌ సెక్యురిటీ అత‌ణ్ని బంధించేలోపు అక్క‌డ‌ గులాబీలను కూడా చల్లాడు. ఇక‌, అత‌న్ని పోలీసులు తీసుకువెళ్లేట‌ప్పుడు ఫ్రెంచ్‌లో మాట్లాడాడు. "కొంతమంది భూమిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, భూమి గురించి ఆలోచించండి!" అని అరుచుకుంటూ వెళ్లాడు. ఇక‌, అత‌ని ఉద్దేశం ఎలాంటిదైనా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత మోనాలిసా పెయింటింగ్‌పై దాడి చేయ‌డం స‌బబు కాద‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమ‌ర్శిస్తున్నారు. అయితే, మోనాలిసాను విధ్వంసకులు లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1956లో, ఒక దుండ‌గుడు పెయింటింగ్‌పై యాసిడ్‌ పోయడంతో కళాఖండం దిగువ భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ సంఘటన కారణంగా, మోనాలిసాను బుల్లెట్ ప్రూఫ్ గాజు వెనుక ఉంచారు.


Similar News