సిరియాపై వైమాణిక దాడులు..వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
సిరియాలోని హిజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. బుధవారం తెల్లవారుజామున వైమాణిక దాడులకు పాల్పడింది.
దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలోని హిజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. బుధవారం తెల్లవారుజామున వైమాణిక దాడులకు పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఈ అటాక్ చేసినట్టు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస(ఐడీఎఫ్) తెలిపింది. ఈ దాడుల్లో హిజ్భొల్లాకు చెందిన స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. ఓ భవనంపై దాడికి సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. ఇంటలిజెన్స్ సమాచారం ఆధారంగానే దాడులకు పాల్పడినట్టు తెలిపింది. అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు హిజ్భొల్లా మద్దతు తెలిపింది. పలుమార్లు ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు సైతం చేసింది. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ సిరియాలోని హిజ్భొ్ల్లా స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది. ఇటీవల వాటిని వేగవంతం చేసింది. మరోవైపు సిరియా భూభాగంపై జరుగుతున్న అన్ని చర్యలకు ఆ దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐడీఎఫ్ తెలిపింది. హిజ్భొల్లా కార్యకలాపాలు ఏ మాత్రం సహించబోమని వెల్లడించింది. దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
దక్షిణ లెబనాన్‌లోని ధైరా, తైర్ హర్ఫా ప్రాంతాల్లోనూ తాజాగా దాడికి పాల్పడినట్టు ఐడీఎఫ్ తెలిపింది. అంతేగాక గత రెండు రోజుల నుంచి నిరంతరం సిరియాలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా, 2011లో దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ సైన్యం సిరియాలో వందలాది దాడులను నిర్వహించింది. ముఖ్యంగా ఇరాన్ అనుకూల స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.