అమెరిక‌న్ స్కూల్లో భార‌త‌జాతీయుల్ని ఇలా వేధిస్తున్నారా..?! వైర‌ల్ వీడియో

ఇలాంటి చోట జాతి వివ‌క్ష చాలా దారుణ‌మైన విష‌యం. An Indian American student being bullied in Texas School

Update: 2022-05-17 12:13 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః అమెరికా అంటేనే స్వేచ్ఛా జీవుల‌కు నెల‌వుగా ఆ దేశ‌స్థులు ప్ర‌చారం చేస్తారు. అయితే, చ‌రిత్ర‌లో నిగ్రోల‌పై అమెరిక‌న్లు చూపించిన బానిస‌త్వం ప్ర‌పంచంలో ఇంకెక్క‌డా ఉండ‌ద‌ని చెప్పొచ్చు. నిజానికి అమెరికా ఏ జాతీకి చెందిన‌ది కాదు. సంక‌ర‌జాతి స‌మూహ‌మే అమెరికాగా ఏర్ప‌డింద‌నేది చరిత్ర చెబుతోంది. ఇలాంటి చోట జాతి వివ‌క్ష చాలా దారుణ‌మైన విష‌యం. అమెరికాలో భార‌తీయులు కూడా ఎక్కువ‌గా ఉండ‌బ‌ట్టే ఆ దేశ ఉపాధ్య‌క్షురాలిగా ఓ ఇండో-అమెరిక‌న్ ఎంపిక‌య్యిందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆ దేశంలోని టెక్సాస్‌లో భారతీయ అమెరికన్ విద్యార్థి వేధింపులకు గుర‌వుతున్న వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇది జ‌నాగ్ర‌హానికి, తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఈ క్లాస్‌లోని తోటి విద్యార్థులు తీసిన ఈ వీడియోలో ఒక విద్యార్థి బెంచ్‌పై కూర్చున్న భారతీయ అమెరికన్ అబ్బాయిని సమీపించి, లేచి నిలబడమని అంటాడు. ఆ సీటు పైనుండి నేను ఎందుకు లేవాలి, ఏ కార‌ణం లేకుండా నేను లేవ‌న‌ని బాధిత విద్యార్థి చెబుతాడు. కానీ, అమెరికన్ విద్యార్థి కోపంగా, బాధితుణ్ని మెడ‌ప‌ట్టి కిందికి వంచి, ప‌డేయ‌డం వీడియోలో క‌నిపిస్తుంది. ఈ సంఘటన టెక్సాస్‌లోని కొప్పెల్ మిడిల్ స్కూల్‌లో జరిగింది. అయితే, దాని సూపరింటెండెంట్ డా. బ్రాడ్ హంట్ ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. ఇలాంటి చ‌ర్య‌లు ఎప్ప‌టికీ సంహించ‌మ‌ని, త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు విద్యార్థుల‌కూ ప‌నిష్మెంట్ ఇవ్వ‌గా, NBCDFW ప్రకారం, వేధింపులకు గురైన విద్యార్థికి మూడు రోజుల స‌స్పెన్ష‌న్‌, అమెరిక‌న్ విద్యార్థికి ఒక‌రోజు స‌స్పెన్ష‌న్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీనిపై బాధితుడి తల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, పాఠశాలలో ఈ సంఘ‌ట‌న‌పైన‌ అంతర్గత విచారణ కొన‌సాగుతున్నందున‌ తల్లిదండ్రులు ఇప్పుడు న్యాయపరమైన స‌హాయం కోసం ఆలోచిస్తున్నారు. అయితే, ఈ ఇండియన్ అమెరికన్ బాయ్‌కి మద్దతుగా 150,000 కంటే ఎక్కువ మంది సంతకాలు చేసిన ఆన్‌లైన్ పిటిషన్ కూడా బ‌య‌ట‌కు రావ‌డం విశేషం.


Similar News