1990ల్లో ఆ ట్రాఫిక్ బారికేడ్ శివలింగంగా ఎలా మారింది.. అమెరికాలో అద్భుతం!
1993లో అమెరికాలో జరిగిన ఓ అద్భుతం వెనుక వార్త ఇది. Traffic Barricade In San Francisco Became A Place Of Worship.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రపంచంలో వందల మతాలున్నాయి. ప్రతి మతానికి దాని ప్రాముఖ్యత, ఆ ప్రజలు అనుసరించే ఆచారవ్యవహారాలు ఉంటాయి. వాటిలో కొన్ని విచిత్రంగా ఉన్నా అవి విశ్వాసానికి సంబంధించిన అంశాలు కనుక సున్నితంగానే అర్థంచేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో సంచలనంగా మారిన గ్యానవాపి మస్జీద్ కేసులో ఆకస్మాత్తుగా మస్జీద్ బావిలో శివలింగం బయటపడిన విషయం తెలిసిందే. అది శివలింగం కాదు వాటర్ ఫౌంటైన్ అంటున్నారు మరో వర్గం. ఏదేమైనా దీని వివాదం కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓ అమెరికన్ పాత న్యూస్ వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 1993లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ అద్భుతం వెనుక వార్త ఇది.
శాన్‌ఫ్రాన్సస్కోలోని గోల్డెన్ గేట్ పార్క్‌లో డంప్ చేసిన ట్రాఫిక్ బారికేడ్ అనుకోకుండా శివలింగంగా మారింది. ఒక హిందూ వ్యక్తి దాని ఆకృతిని గమనించి, ఫాలస్ ఆకారంలో ఉన్న శిల శివుని మందిరానికి అనువుగా ఉంటుందని ఆలోచించాడు. 'ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెదికినా అందందే గలడు దేవుడని..', ఆ ట్రాఫిక్ బారికేడ్‌నే శివుని లింగంగా పోల్చుకొని, పూజలు ప్రారంభించాడు. బసుల్ పారిక్ అనే ఓ అమెరికన్ హిందూయే ఈ శిలను గుర్తించిన మొదటి వ్యక్తి. ఇక అప్పటి నుండి అది హిందువులకు అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రార్థనా స్థలంగా మారింది. ఈ మందిరాన్ని పరిశీలించేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలిరావడం మొదలయ్యింది. ఇక్కడ ప్రతి సోమవారం భక్తులు వచ్చి, లింగంపైన పాలు, తేనెతో పూజలు చేసి, పువ్వులు సమర్పిస్తారు.
అప్పట్లో ఈ వార్త CNNలో ప్రసారం చేశారు. ఈ న్యూస్ క్లిప్‌లో ట్రాఫిక్ బారికేడ్ శివలింగంగా ఎలా మారిందో తెలియజేస్తారు. అయితే, చాలా మంది భక్తులు ఈ స్థలాన్ని పార్క్ లోపల శాశ్వత దేవాలయంగా మార్చాలని ప్రయత్నించారు. కానీ, ప్రభుత్వ అధికారులు మాత్రం దానికి సమ్మతించలేదు. నగరానికి చెందిన ఈ పబ్లిక్ పార్క్ స్థలంలో దేవాలయాలు అనుమతించమని చెప్పారు. ఇలాగే ఉంటే ఎలా అవుతుందోనని, అధికారులు ఈ మందిరాన్ని పార్క్ నుండి తొలగించారు. భక్తులు సందర్శించుకోడానికి లింగాన్ని సన్‌సెట్ డిస్ట్రిక్ట్ ఆర్టిస్ట్ స్టూడియోలో ప్రతిష్టించారు. పార్కు పుణ్యక్షేత్రంగా మార్చాలనుకున్న చాలా మంది ప్రజలు ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఇది పార్కుకు వెళ్లేవారికి ఆటంకం కలిగించడం, పార్క్ మధ్యలో చాలా మంది భక్తులు రావడం వల్ల గందరగోళం ఏర్పడటంతో దాన్ని తొలగించినట్లు అధికారులు చెప్పారు. అయినా, దేవుడు సర్వాంతర్యామి ఎక్కడైన కొలువుదీరగలడు!