మినీ జలాంతర్గామి కథ విషాదాంతం.. ఐదుగురు జలసమాధి
అట్లాంటిక్ మహా సముద్రంలోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్ కథ విషాదాంతమైంది.
వాషింగ్టన్ : అట్లాంటిక్ మహా సముద్రంలోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. సముద్ర గర్భంలోని వాతావరణంలో ఆకస్మిక మార్పులతో తీవ్ర ఒత్తిడి ఏర్పడి టైటాన్ పేలిపోయిందని అమెరికన్ కోస్ట్‌గార్డ్ ధ్రువీకరించింది. దీంతో అందులో వెళ్లిన ఐదుగురు బిలియనీర్ టూరిస్టులు జలసమాధి అయ్యారు. టైటానిక్ నౌకకు దగ్గర్లోనే టైటాన్ సబ్‌మెర్సిబుల్ కు సంబంధించిన శకలాలున్న ప్రదేశాన్ని ఫ్రాన్స్ కు చెందిన ఒక రోబో గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు. ఒకవేళ టైటాన్ శకలాల దగ్గర మృతదేహాలను గుర్తించినా.. అట్లాంటిక్ అడుగున ఉన్న వాతావరణం నుంచి వాటిని బయటకు తేలేని పరిస్థితి ఉందని అమెరికా కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటించింది.
అమెరికా కోస్ట్ గార్డ్, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపింది. " టైటాన్ సబ్‌మెర్సిబుల్ లో మా సంస్థ సీఈవో స్టాక్టన్ రష్ తో పాటు వెళ్లిన షెహ్జాదా దావూద్, సులేమాన్ దావూద్, హమీష్ హర్డింగ్, పాల్ హెన్రీ నార్గెలెట్ ఇక ప్రాణాలతో లేరు" అని టూర్ నిర్వాహక సంస్థ ‘ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్’ ప్రకటించింది. ఐదు రోజులపాటు ప్రపంచం మొత్తం ఆ ఐదుగురు టూరిస్టుల జాడ కోసం ఉత్కంఠగా ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. రెస్క్యూ ఆపరేషన్లన్నీ వ్యర్థమయ్యాయి. టైటానిక్‌ను చూసేందుకు కడలి గర్భంలోకి వెళ్లిన వారు.. ఆ సముద్ర గర్భంలోనే కలిసిపోయారు.