Lebanon : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 274 మంది మృతి

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్‌ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది.

Update: 2024-09-23 17:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్‌ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 274 మంది లెబనాన్ పౌరులు చనిపోయారు. దాదాపు 1000 మందికిపైగా గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. 2006 సంవత్సరంలో జరిగిన ఇజ్రాయెల్ -లెబనాన్ యుద్ధం తర్వాత ఇంత భీకర స్థాయిలో లెబనాన్‌ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు చేయడం మళ్లీ ఇదే తొలిసారి. ఈ దాడులు చేయడానికి ముందు లెబనాన్ దక్షిణ సరిహద్దు భాగంలోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ అల్టిమేటం ఇచ్చింది.

ఈవిషయాన్ని తెలియజేస్తూ ఇజ్రాయెల్ నుంచి లెబనాన్ ప్రజలకు దాదాపు 80వేలకుపైగా కాల్స్ వచ్చాయి. ఈ హెచ్చరికలు వెలువడిన కొన్ని గంటల్లోనే యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. తాజాగా సోమవారం జరిపిన గగనతల దాడుల్లో లెబనాన్‌లోని 300కుపైగా లక్ష్యాలను ఛేదించామని ఇజ్రాయెలీ ఆర్మీ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తమ దేశ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. లెబనాన్‌పై తాము చేస్తున్న సైనిక ఆపరేషన్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు.


Similar News