ఇజ్రాయెల్ పైకి ఏడాదిలో 26వేల రాకెట్ దాడులు

Update: 2024-10-07 05:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : హమాస్ తో ఘర్షణ మొదలైన ఏడాది కాలంలో శతృదేశాల నుంచి 26వేల రాకెట్ దాడులు జరిగినట్లుగా ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్) వెల్లడించింది.ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐడీఎఫ్ ఏడాదిగా జరిగిన దాడి..ప్రతిదాడుల వివరాలను వెల్లడించింది. రాకెట్ దాడుల్లో గాజా నుంచి 13,200, లెబనాన్ నుంచి 12,400 దూసుకురాగా.. మిగిలినవి యెమన్, సిరియా, ఇరాన్ల నుంచి ప్రయోగించారని తెలిపింది. వందల సంఖ్యలో రాకెట్లు ఆయా ప్రాంతాల్లోనే కూలిపోయినట్లు వెల్లడించింది. శతృ దాడుల్లో 728 మంది తమ సైనికులు, రిజర్విస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పైకి హమాస్ బలగాలు ఆకస్మికంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 1,200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 251 మంది కిడ్నాప్నకు గురయ్యారు. వీరిలో కొందరిని విడిపించగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోగా, ఇంకా 100మంది వరకు హమాస్ వద్ద బందీలుగానే ఉన్నారు.

గాజాపట్టీలో 40,300 లక్ష్యాలపై దాడులు చేశామని.. మొత్తం 4,700 సొరంగ ప్రవేశమార్గాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. అక్టోబర్ 8 నుంచి లెబనాన్ లోని హెజ్ బొల్లా కూడా తమపై దాడులు మొదలు పెట్టిందని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. దీంతో తాము ఎదురుదాడుల్లో ఆ సంస్థకు చెందిన మొత్తం 800 మందిని మట్టుబెట్టగా వీరిలో 90 మంది టాప్ కమాండర్లు ఉన్నట్లు పేర్కొంది. అదే సమయంలో 11,000 హెజ్ బొల్లా స్థావరాలను పేల్చేశామని ప్రకటించింది. గాజా పట్టీలో 17,000 మంది హమాస్ ఆపరేటివ్ లను, ఇజ్రాయెల్ పరిధిలో 1,000 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఆ గ్రూప్ ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. వీరిలో 30 మంది హమాస్ బెటాలియన్, 165 మంది కంపెనీ కమాండర్లను మట్టుబెట్టినట్లు తెలిపింది.


Similar News