China bridge collapsed: చైనాలో ఆకస్మిక వరదలు.. కూలిన వంతెన.. 11 మంది మృతి

వాయువ్య చైనాలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆకస్మాత్తుగా వరద రావడంతో ఒక వంతెన కూలిపోయింది

Update: 2024-07-20 08:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వాయువ్య చైనాలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆకస్మాత్తుగా వరద రావడంతో ఒక వంతెన కూలిపోయింది. షాంగ్లూ నగరంలోని ఝాషుయ్ కౌంటీలో ఉన్న ఈ వంతెన ఆకస్మాత్తుగా భారీగా పెరిగిన వరద ప్రవాహాన్ని తట్టుకోలేక శుక్రవారం రాత్రి 8:40 గంటలకు పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, దాదాపు 30 మందికి పైగా తప్పిపోయినట్లు అధికారులు శనివారం తెలిపారు. ప్రమాద సమయంలో వంతెనపై ఉన్న వాహనాలు అన్ని కూడా జింకియాన్ నదిలోకి పడిపోయాయి. అయితే ఎన్ని వాహనాలు కూలిపోయాయే అధికారులు లెక్కించాల్సి ఉంది. వంతెన కూలిన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. నదిలో పడిపోయిన ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. చైనా నేషనల్ కాంప్రహెన్సివ్ ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ 736 మంది సిబ్బందిని, 76 వాహనాలను, 18 బోట్లను, 32 డ్రోన్‌లను సహాయక చర్యలకు పంపినట్లు తెలిపింది. ఈ ప్రమాదంపై స్పందించిన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు అన్ని విధాలా సహాయ, సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News