ఆ18 మంది మహిళలను చూస్తే అందరికీ హడలే!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో మహిళా మాఫియా తెరపైకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు భూసెటిల్మెంట్లు, పంచాయతీలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వెళ్లింది. సెటిల్మెంట్లు, దందాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సైతం గుర్తించారు. వీరు మహిళలు కావడంతో పెద్ద పెద్ద వాళ్లు సైతం వారి జోలికి రావడం లేదు. ఇదే అదనుగా భావించి రెచ్చిపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో పలువురు మహిళలు సంఘాల పేరుతో పంచాయతీలు చేస్తున్నారు. […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో మహిళా మాఫియా తెరపైకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు భూసెటిల్మెంట్లు, పంచాయతీలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వెళ్లింది. సెటిల్మెంట్లు, దందాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సైతం గుర్తించారు. వీరు మహిళలు కావడంతో పెద్ద పెద్ద వాళ్లు సైతం వారి జోలికి రావడం లేదు. ఇదే అదనుగా భావించి రెచ్చిపోతున్నారు.
మంచిర్యాల జిల్లాలో పలువురు మహిళలు సంఘాల పేరుతో పంచాయతీలు చేస్తున్నారు. భూ పంచాయతీల దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తగాదాల వరకు సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆయా పంచాయతీల్లో పర్సంటేజీల పేరుతో వసూళ్ల దందా చేస్తున్నారు. మహిళా సంఘాల పేరుతో అక్రమ దందాలు, పంచాయతీలు చేస్తున్నారు. భూపంచాయతీల్లో వారు చెప్పినట్లు వినాల్సిందే. లేకుంటే పలురకాలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మహిళలు కావడంతో వారి జోలికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా సందర్భాల్లో పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా ముందు వెనకాడుతున్నారు.
18 మంది మహిళలు..
ఇలా పంచాయతీలు చేస్తున్న వారు దాదాపు 18మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఒక పంచాయతీ చేస్తే కనీసం రూ.50వేల నుంచి లక్ష వరకూ ముట్టచెప్పాల్సిందే. భార్యభర్తల మధ్య పంచాయతీ చేస్తే కట్నంలో సైతం పర్సంటేజీలే. ఇక భూమి పంచాయతీలైతే లెక్కేలేదు. ఎన్నో ఏండ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు సమాచారం. మహిళలు కావడం, కొందరు కులం కార్డు సైతం వాడుతుండటంతో చాలా మంది తమకు అన్యాయం జరిగినా తలవంచుకుని సైలెంట్‌గా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఏసీపీ సీరియస్ వార్నింగ్..
మహిళా మాఫియా విషయం తెలిసిన మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ సోమవారం వీరందరనీ పిలిచి వార్నింగ్ ఇచ్చారు. సెటిల్‌మెంట్లు, పంచాయతీలు చేస్తున్న 18 మంది మహిళలను తన ఆఫీస్‌కు పిలిచి కౌన్సెలింగ్ చేశారు. ఇప్పటి వరకు మీరు చేసిన పంచాయతీలు నా దృష్టిలో ఉన్నాయి. అవన్నీ మానుకోవాలని స్పష్టం చేశారు. ఇక ముందు మీరు ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా కేసులు పెట్టి జైలుకు పంపుతానని హెచ్చరించారు. మహిళలు అని కూడా చూడకుండా కేసులు పెడతామని.. ఇక ముందు ఇలాంటివి సాగవని స్పష్టం చేశారు. అంతమంది మహిళలను ఏసీపీ ఆఫీసుకు పిలిపించి హెచ్చరించడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది.