మంచం మీద ముఖంపై గాయాలతో మహిళ మృతి.. ఏం జరిగింది.?
దిశ, అల్వాల్ : వరుస హత్యలు అల్వాల్‌లో కలకలం రేపుతున్నాయి. మొన్న ఓ వృద్దురాలిని కిరాయిదారుడే అంతమొందించగా, శనివారం మరో మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పూలమ్మ(40) అల్వాల్‌లో వెంకటాపురంలోని ఓ గుడిసెలో ఒంటరిగా నివాసం ఉంటూ.. అడ్డాకూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో శనివారం ఉదయం పూలమ్మ గుడిసెలో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూశారు. అప్పటికే ఆమె.. ముఖంపై […]
దిశ, అల్వాల్ : వరుస హత్యలు అల్వాల్‌లో కలకలం రేపుతున్నాయి. మొన్న ఓ వృద్దురాలిని కిరాయిదారుడే అంతమొందించగా, శనివారం మరో మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పూలమ్మ(40) అల్వాల్‌లో వెంకటాపురంలోని ఓ గుడిసెలో ఒంటరిగా నివాసం ఉంటూ.. అడ్డాకూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నది.
ఈ క్రమంలో శనివారం ఉదయం పూలమ్మ గుడిసెలో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూశారు. అప్పటికే ఆమె.. ముఖంపై తీవ్ర గాయాలతో మంచంపై పడి ఉంది. ఆమెను పిలిచినా పలకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. మహిళ చనిపోయినట్లు నిర్దారించారు. ఆమె మృతిపై విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, వేలి ముద్రల నిపుణులను రంగంలోకి దింపి వివరాలను సేకరించారు. పూలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హత్యపై అనుమానాలు..
పూలమ్మ దారుణ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఓ వ్యక్తి గుడిసెలకు చెందిన స్థలం తమదని, గుడిసెలను ఖాళీ చేసేందుకు ప్రయత్నించగా.. పూలమ్మ అడ్డుకుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో, పూలమ్మపై సదరు వ్యక్తి దాడికి యత్నించగా, ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే, హత్యకు భూ వివాదమే కారణమా.? లేక ఇతర కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలతో పాటు, బాధితురాలి కాల్ లిస్టు అధారంగా కేసును త్వరలోనే చేధిస్తామని అల్వాల్ సీఐ గంగాధర్ తెలిపారు.