ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టం కట్టేదెవరికి..?

దిశ ప్రతినిధి, ఖమ్మం : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. భవిష్యత్‎లో రానున్న ఎన్నికలకు ఈ ఫలితాలు గీటురాయి కానుండడంతో ఎప్పుడూ లేనంత ఫోకస్ చేస్తున్నాయి. దీంతో పట్టభద్రులకే పరిమితమైన ఈ ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగియగా నల్లగొండ‌‌- ఖమ్మం- వరంగల్ స్థానానికి 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ప్రచారంపై దృష్టిపెట్టిన అన్ని పార్టీలు తమ అభ్యర్థి గెలుపుకోసం కృషి […]

Update: 2021-02-28 09:03 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. భవిష్యత్‎లో రానున్న ఎన్నికలకు ఈ ఫలితాలు గీటురాయి కానుండడంతో ఎప్పుడూ లేనంత ఫోకస్ చేస్తున్నాయి. దీంతో పట్టభద్రులకే పరిమితమైన ఈ ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగియగా నల్లగొండ‌‌- ఖమ్మం- వరంగల్ స్థానానికి 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ప్రచారంపై దృష్టిపెట్టిన అన్ని పార్టీలు తమ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తున్నాయి. ప్రత్యర్థులపై మీటింగులు పెట్టి విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రజానీకం నుంచి మేధావుల వరకు పట్టభద్రులు పట్టం కట్టేదెవరికంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థుల బలాబలాలను కూడా అంచనా వేస్తున్నారు.

అధికార పార్టీ అభ్యర్థికి 50-50

అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలను కవర్ చేశారు. అధికార పార్టీ అభ్యర్థి కావడం పల్లాకు భారీగా కలిసొచ్చే అంశం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీ శ్రేణులందరూ పల్లా గెలుపుకోసం కృషిచేస్తున్నారు. కాగా, పల్లా నిరుద్యోగులను ఆరేళ్లుగా ఏమాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిరుద్యోగులు, ఉద్యోగులు టీఆర్ఎస్ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఇక ఫిట్‎మెంట్ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు గ్యాప్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ అంశం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది.

కోదండకు సింపథీ కలిసొచ్చేనా..?

ఇక, ప్రొఫెసర్ కోదండరాం విషయానికి వస్తే అన్ని యూనివర్సీటీల విద్యార్థులు, ఉద్యోగులు, మేధావి వర్గం ప్రొఫెసర్ మీద సింపథీతో ఉన్నాయి. యువత, నిరుద్యోగుల సమస్యపై స్పష్టమైన అవగాహన ఉన్న సార్‌ని గెలిపిస్తే చట్టసభల్లో గళం విప్పుతారని అదీకాక ఆయనను గెలిపిస్తే ఇలాగైనా సముచిత స్థానం కల్పించినట్లవుతుందని ఓవర్గం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు సైతం కోదండరాంనే ప్రధాన ప్రత్యర్థిగా చూడడం గమనార్హం.

బీజేపీకి పెరిగిన బలం..

బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి కొంత సానుకూల వాతావరణమే కలిగిస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేతలు సోషల్ మీడియాను కూడా వీలైనంతగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగడంతో ప్రచారం సులవవుతోంది. ఇక రాష్ట్రస్థాయి నేతలు ఎవరూ కనిపించపోవడం, జిల్లాస్థాయి నేతలే ప్రచారంలో పాల్గొంటుండడం కొంత ప్రతికూలంగా మారింది.

అదృష్టం పరీక్షించుకుంటున్న కాంగ్రెస్..

కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు వ్యక్తిగతంగా మంచి పేరుంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాడనే సానుభూతి యువతలో ఉంది. అయితే అవి ఎంత వరకు ఓట్లుగా మారుతాయనేది సందేహం. ఇన్నాళ్లూ ఎవరికి వారుగా ఉన్న ఆపార్టీ నేతలు ఇప్పుడు పట్టభద్రుల స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు కలిసికట్టుగా ప్రయత్నించడం కొంత అనుకూలించినా.. సరైన నాయకత్వం లేకపోవడం.. స్పందిచాల్సిన సమయంలో స్పందించకపోవడం వల్ల పట్టభద్రుల్లో కాంగ్రెస్‌పై కొంత అసహనం ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రభావం చూపేలా మిగతా అభ్యర్థులు..

మిగతా అభ్యర్థులు సైతం యువత తరఫున గళం విప్పేందుకు చట్టసభల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారు. ముఖ్యంగా వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి జయసారథి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈయన ఓ జర్నలిస్టు కావడం, యువత సమస్యలపై లోతైన అవగాహన ఉండడంతో ఉద్యోగులు, నిరుద్యోగులు కొంత మంది ఈయనవైపు మళ్లొచ్చనే అంచనా ఉంది. ఇక యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిని రాణి రుద్రమ కూడా జర్నలిస్టు. ఈమెకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్ నల్లగొండ జిల్లాలో చాలావరకు ప్రభావం చూపొచ్చంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా ఇంత మంది పేరున్న అభ్యర్థుల మధ్య ప్రధాన పార్టీల బలం తక్కువవుతుందనేది వాస్తవంగా కనిపిస్తోంది. ఇంకా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. వీళ్లలో ఎవరూ గెలవకపోయినా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

హామీలు మరిచి.. విమర్శలకే పరిమితం..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ప్రధాన పార్టీలు సహా మిగతా అభ్యర్థులందరూ హామీలు ఇవ్వడం మరచి ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికే పరిమితమవుతున్నారు. దాదాపు అందరు అభ్యర్థులు అధికార పార్టీ అభ్యర్థిని, టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచిన సంగతినే పట్టభద్రుల్లోకి తీసుకుపోతున్నారు. విమర్శనాస్త్రాలు సంధించుకోవడం వదిలి గెలిస్తే పట్టభద్రులకు ఏం చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు.

Tags:    

Similar News