దళిత బంధులో మా వాటా ఎంత..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు పథకంలో రాష్ట్రంలోని ఎస్సీ ఉప కులాల వాటా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో సమితి జిల్లా మహా సభ జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీలలో 34 శాతం ఉన్న ఉప కులాలకు వాటాను వివరించాలని డిమాండ్ చేశారు. దళితులకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందక […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు పథకంలో రాష్ట్రంలోని ఎస్సీ ఉప కులాల వాటా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో సమితి జిల్లా మహా సభ జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీలలో 34 శాతం ఉన్న ఉప కులాలకు వాటాను వివరించాలని డిమాండ్ చేశారు. దళితులకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందక మొదటి నుండి ఉప కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత 57 ఉప కులాలకు కేవలం 7 శాతం మాత్రమే లబ్ది జరిగిందని, దళితుల అభివృద్దిని కాంక్షించినట్టయితే ముందుగా ఉప కులాలకు దళిత బంధులో మొదటి ప్రాధాన్యత కల్పించాలని బైరి వెంకటేశం కోరారు. హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని ఎస్సీ ఉప కులాల వారికి వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ ఇళ్ల పథకంలో సబ్ క్యాస్ట్ వారికి అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ ఉప కులాల కోసం ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకు లీంకేజీతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. మోచి, హోలియ దాసరి, మాస్టిన్, మితల్ అయ్యవార్, మాదాసి కూరువ కులాలకు చెందిన వారు సకాలంలో కుల ధృవీకరణ పత్రాలు అందుకోలేక పోతున్నారని, దీంతో ఉన్నత విద్యను, సకాలంలో సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారని వెంకటేశం వివరించారు. వీరికి ఆర్డీఓలు కాకుండా తహసీల్దార్లచే కుల దృవీకరణ పత్రాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని, ఎస్సీ ఉప కులాల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని బైరి వెంకటేశం కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్సుడు మోండె మల్లిఖార్జున స్వామి మాల జంగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏర్పుల భాస్కర్ బైండ్ల, ఉపాధ్యక్షులు నీరగొండ బుచ్చన్న గోసంగి, ఆదిముళ్ల వెంకటేశ్ హోలియ దాసరి, బుద్దుల గంగ నర్సయ్య మాస్టిన్, రాయిల లక్ష్మీ నర్సయ్య చిందు, జిల్లా గౌరవ అధ్యక్సులు గంట శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదవరపు శ్రీనివాస్ మాస్టిన్ లు హాజరయ్యారు.