మే 3 తర్వాత లాక్‌డౌన్ ఏమవుతది?
దిశ, న్యూస్‌బ్యూరో: ఐదు వారాలుగా దేశమంతా ఉన్న లాక్‌డౌన్ ఇంకెంతకాలం ఉంటుందోననే చర్చలు మొదలయ్యాయి. నెల రోజులకుపైగా అన్ని సెక్షన్ల ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ను కొనసాగించడమా లేక ఎత్తేయడమా అనేదానిపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగి ఆ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలవుతున్న తీరును, ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ను మరికొన్ని వారాలపాటు కొనసాగించాలని పలు రాష్ట్రాలు సూచించాయి. లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేయడం సాధ్యం […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఐదు వారాలుగా దేశమంతా ఉన్న లాక్‌డౌన్ ఇంకెంతకాలం ఉంటుందోననే చర్చలు మొదలయ్యాయి. నెల రోజులకుపైగా అన్ని సెక్షన్ల ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ను కొనసాగించడమా లేక ఎత్తేయడమా అనేదానిపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగి ఆ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలవుతున్న తీరును, ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ను మరికొన్ని వారాలపాటు కొనసాగించాలని పలు రాష్ట్రాలు సూచించాయి. లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేయడం సాధ్యం కాదని గతంలోనే ప్రధాని చెప్పగా మే నెల 3వ తేదీ తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దశలవారీగా ఎత్తేస్తారా లేక మరికొంతకాలం పొడిగిస్తారా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఇచ్చిన సడలింపులను యథావిధిగా కొనసాగిస్తూ ఇంకా కొన్ని రకాల ఆంక్షలను ఎత్తేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎలాగూ మే నెల 7వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుకానుంది. అప్పటికి కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించవచ్చు.
దైనందిన జీవితంలో ఒక భాగం..
వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్‌పై స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ ఏకకాలంలో ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరాన్ని మాత్రం ప్రధాని నొక్కిచెప్పారు. కరోనా వైరస్ మరికొన్ని నెలలపాటు పీడిస్తుందని శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలను ఉటంకిస్తూ ఇకపై మాస్క్ ధరించడం దైనందిన జీవితంలో ఒక భాగం కావాలన్న సంకేతాన్ని ఇచ్చారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రెడ్ జోన్లను క్రమంగా నియంత్రిస్తూ గ్రీన్ జోన్‌లోకి తీసుకు రావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఒకటిన్నర నెలలుగా లాక్‌డౌన్‌ను అమలు చేసిన కారణంగా మంచి ఫలితాలే వచ్చాయని, వేలాది ప్రాణాలను కాపాడగలిగామని అభిప్రాయపడ్డారు. వైరస్ బాధ ఇప్పుడే తొలగిపోదని, నిరంతర అప్రమత్తత అవసరం అని పేర్కొన్నారు. ఇన్ని జాగ్రత్తలు సూచించినందున పాక్షికంగా లాక్‌డౌన్‌ను ఎత్తేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు..
ఇప్పటికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని ఇప్పుడు నాల్గవ దఫా సమావేశంలో మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిషా, రాజస్థాన్, పుదుచ్చేరి, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి మాత్రం లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగాలన్న అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రాముఖ్యతను గుర్తించి మే నెల 7వ తేదీ వరకు పొడిగించింది. అప్పటి పరిస్థితులనుబట్టి దశలవారీగా ఎత్తివేయడమా లేక మరికొంతకాలం పొడిగించడమా అని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుంది. కరోనాపై ప్రగతిభవన్‌లో ఆదివారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగిస్తూ ప్రజలు వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నట్లయితే వైరస్ పీడ వదులుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, గద్వాల, రంగారెడ్డి, వరంగల్ అర్భన్, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే రెండంకెల స్థాయిలో యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయి. త్వరలో వీరు కూడా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. తొమ్మిది జిల్లాలు ఇప్పటికే కరోనా రహితంగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే లాక్‌డౌన్ పాటిస్తూ మిగిలిన చోట్ల సడలింపులు ఇచ్చే అవకాశంపై వచ్చే నెల 5వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా, ఆంక్షలను సడలించినా ప్రజల కదలికలతో మళ్ళీ వ్యాపిస్తుందని, ఇప్పటిదాకా తీసుకున్న పటిష్ట చర్యలకు అర్థం లేకుండాపోతుందనే వాదన కూడా ఉంది. వచ్చే నెల 25 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలన్న అభిప్రాయం కొద్దిమంది అధికారుల నుంచి వ్యక్తమైనట్లు తెలిసింది. అప్పటికీ పాజిటివ్ కేసులేవీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులన్నింటినీ ట్రేస్ చేయడం, ప్రస్తుతం చికిత్స పొందుతున్న పేషెంట్లంతా డిశ్చార్జ్ అవుతారు కాబట్టి నెలాఖరు వరకు పొడిగించడమే ఉత్తమమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోన్నది. అప్పటికీ రంజాన్ పండుగ మాసం కూడా పూర్తవుతుంది.
మంత్రులు, అధికారులతో కేసీఆర్ చర్చ
ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలను మంత్రులు, అధికారులతో కేసీఆర్ చర్చించారు. కేంద్రం నిర్ణయం ఎలా ఉన్నా రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి వైఖరి అవలంబించడం శ్రేయష్కరంగా ఉంటుందనే అంశాన్ని చర్చించినట్లు తెలిసింది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయినా కేంద్రం నుంచి మాత్రం ప్యాకేజీ, ఎఫ్ఆర్‌బిఎం పరిమితి పెంపు, రుణాల చెల్లింపుపై ఆరు నెలల వాయిదా, హెలికాప్టర్ మనీ లాంటివాటికి సంబంధించి హామీ రాకపోవడం ప్రభుత్వానికి నిరాశ కల్పించింది. కేంద్రం లాక్‌డౌన్ ఎత్తివేస్తే రాష్ట్రంలో దాని ప్రభావం ఎలా ఉంటుందని, రాష్ట్రంలో కొనసాగించినా ఇతర రాష్ట్రాల నుంచి వైరస్ మళ్ళీ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఎలా ఉన్నాయి, వాటిని నియంత్రించడం ఎలా… అనేక కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నది. మే 3వ తేదీన ప్రధాని చేసే ప్రకటనపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.
tags: Telangana, India, LockDown, Corona, PM Modi, Video Conference, States CMs, KCR