అన్ని పట్టణాల్లో వ్యర్థాల రీ సైక్లింగ్ ప్లాంట్లు : కేటీఆర్
దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను క్లస్టర్ పద్ధతిలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో చెత్తను సేకరించి డంప్ చేస్తున్న ట్రాన్స్ ఫర్ స్టేషన్లను వందకు పెంచుతామన్నారు. వీలైనంత వేగంగా చెత్తను నగరం నుంచి తరలించేందుకు అదనంగా మరో 90 భారీ వాహనాలను సమకూర్చుతున్నట్లు ప్రకటించారు. భవన నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసేందుకు నగర శివారులోని ఫతుల్లాగూడలో […]
దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను క్లస్టర్ పద్ధతిలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో చెత్తను సేకరించి డంప్ చేస్తున్న ట్రాన్స్ ఫర్ స్టేషన్లను వందకు పెంచుతామన్నారు. వీలైనంత వేగంగా చెత్తను నగరం నుంచి తరలించేందుకు అదనంగా మరో 90 భారీ వాహనాలను సమకూర్చుతున్నట్లు ప్రకటించారు. భవన నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసేందుకు నగర శివారులోని ఫతుల్లాగూడలో ఏర్పాటు చేసిన ప్లాంటును మంత్రి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు.
నగరంలో వ్యర్థాలను సేకరించేందుకు 18001201159 నెంబర్ తో ప్రత్యేక టోల్ ఫ్రీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెట్ ప్రాసెసింగ్ సాంకేతికతతో నిర్మించిన ఈ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ద్వారా రోజుకి 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేయవచ్చునని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే జీడిమెట్ల లో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫతుల్లాగూడ ప్లాంటుతో పాటు మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను చెరువుల్లో, నాలాల్లో, కాలువల్లో వేసే పద్ధతికి స్వస్తి పలకాలని ఆయన కోరారు.
నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన పలు చర్యల వల్ల ఘన వ్యర్థాల సేకరణ గతంలో మూడు వేల మెట్రిక్ టన్నుల వరకుండగా, ప్రస్తుతం 7500 మెట్రిక్ టన్నులకు పెరిగిందని వివరించారు. జవహర్ నగర్ లో చెత్త నుంచి 20 మెగావాట్ల విద్యుత్ ను తయారు చేసే ప్లాంటును ఇప్పటికే ఏర్పాటు చేయగా, అదనంగా మరో 28 మెగావట్ల విద్యుత్ ను తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే నగరంలో చెత్తను, తడి,పొడిగా వేర్వేరుగా సేకరిస్తున్నామని, తడి చెత్తతో ఎరువులు తయారు చేస్తుండగా, పొడి చెత్తతో విద్యుత్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క ఎల్బీనగర్ లోనే రూ. 450 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు.
నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎస్ఆర్ డీపీనీ అమలు చేసిన విధంగానే నాలాలను విస్తరించి, అభివృద్ధి చేసేందుకు నాలా స్టాటెజికల్ డెవలప్ మెంట్ ప్లాన్ (ఎస్ఎన్ డీపీ)ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. గత సంవత్సరం భారీ వర్షాల వల్ల వచ్చిన వరద ముంపును నివారించేందుకు రూ. 850 కోట్ల వ్యయంతో నాలాల అభివృద్ధి చేపట్టేందుకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశమ్, బి. దయానంద్, పర్యాటక సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, నాగోల్ కార్పొరేటర్ అరుణ యాదవ్, రాంకీ ఎన్విరో సంస్థ ఎండీ డి. గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.