ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ విజేత ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ విజేతగా మళ్లీ ఆస్ట్రేలియానే నిలిచింది.
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ విజేతగా మళ్లీ ఆస్ట్రేలియానే నిలిచింది. ఆసిస్ మహిళల జట్టు టైటిల్ గెలవడం వరుసగా ఇది మూడోసారి. 2014-16, 2017-20 సీజన్లలో చాంపియన్‌గా నిలిచింది. సోమవారం న్యూజిలాండ్‌ను మూడో వన్డేలో చిత్తు చేయడంతో ఆసిస్ మరోసారి చాంపియన్‌గా అవతరించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఆస్ట్రేలియా మహిళల జట్టు కివీస్‌పై గెలుపుతో చాంపియన్‌షిప్ టైటిల్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. 2-0తో సిరీస్ విజయాన్ని అందుకుంది.
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్..గార్డ్‌నెర్(74), లిచ్‌ఫీల్డ్(50) రాణించడంతో 49 ఓవర్లలో 290 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కివీస్ 215 పరుగులకే ఆలౌటైంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ టోర్నీ(2022-25) మూడేళ్లపాటు జరుగుతుంది. ఈ సీజన్‌లో ప్రతి జట్టు 24 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అత్యధిక పాయింట్లు సాధించిన జట్టే విజేతగా నిలుస్తుంది. కివీస్‌పై గెలుపుతో ఆసిస్ 39 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇతర ఏ జట్టూ కూడా కంగారులను వెనక్కినెట్టే అవకాశం లేకపోవడంతో టైటిల్ ఆసిస్ సొంతమైంది. భారత్ తన కోటాలో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఐదింట నెగ్గినా 37 పాయింట్లే సాధిస్తుంది. ప్రస్తుతం ఇండియా 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నది. ఈ చాంపియన్‌షిప్‌లో టాప్-6 జట్లు వన్డే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి.