Digital Arrest Scam: 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ కారణంగా రూ. 12 కోట్లు మోసపోయిన టెక్ ఉద్యోగి
పోలీసు అధికారులమంటూ నటించి సైబర్ మోసగాళ్లు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 మధ్య రూ. 11.8 కోట్లను దోచుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సైబర్ మోసాలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ టెక్ ఉద్యోగి కోట్ల రూపాయలను పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సైబర్ మోసగాళ్లు 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లో దాదాపు రూ.12 కోట్లు కొల్లగొట్టారు. పోలీసు అధికారులమంటూ నటించి సైబర్ మోసగాళ్లు మనీలాండరింగ్ వ్యవహారంలో బ్యాంకు ఖాతాల కోసం తన ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తున్నారని నమ్మబలికారు. ఈ పేరుతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 మధ్య రూ. 11.8 కోట్లను దోచుకున్నారు. మోసపోయినట్టు గుర్తించిన ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవమర్ 11న బాధితుడికి ఫోన్ చేసిన స్కామర్లు ట్రాయ్ అధికారి పేరుతో మాట్లాడారు. ఆధార్ కార్డుతో లింక్ అయిన సిమ్‌ను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారని, ఈ వ్యవహారంలో ముంబైలోని కొలాబ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు నమ్మించారు. ఆ తర్వాత స్కైప్ ద్వారా వీడియో కాల్‌లో పోలీసుల వేషంలో ఆధార్ కార్డు ద్వారా బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 6 కోట్ల లావాదేవీలు జరిగాయి. మనీలాండరింగ్ కోసం తన బ్యాంకు అకౌంట్ వాడారని భయపెట్టిన స్కామర్లు సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. పలు దశల్లో ఫోన్ కాల్ ద్వారా బెదిరించిన స్కామర్లు బాధితుడి నుంచి రూ. 11.8 కోట్లు బదిలీ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదు ఆధారంగా ఐటీ చట్టం, బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.